చెన్నైకి చెందిన 25 ఏళ్ల ఓ గృహిణి, ఇంట్లో రోజూ చేసే పనులను వీడియో తీస్తూ గంటకు రూ.250 వరకు సంపాదిస్తున్న ఆసక్తికరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
దీనికోసం ఆమె తన తలకు స్మార్ట్‌ఫోన్‌ను అమర్చుకుని, రోజూవారీ ఇంటి పనులను ఫస్ట్-పర్సన్ వ్యూలో (First-person perspective) రికార్డ్ చేస్తుంది. ఈ వీడియో డేటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు హ్యూమనాయిడ్ రోబోలకు (Humanoid Robots) శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మనుషులు పనులు చేసేటప్పుడు చేతులు, శరీరం సహజంగా ఎలా కదులుతాయో రోబోలు నేర్చుకోవడానికి ఈ డేటా ఎంతో కీలకం.
కూరగాయలు తరగడం, బట్టలు మడతపెట్టడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి పనులను రికార్డ్ చేసి పంపుతున్నారు. కంప్యూటర్లలో రూపొందించే కృత్రిమ యానిమేషన్ల కంటే, రియల్ లైఫ్‌లో మనుషులు చేసే పనుల కదలికలే రోబోటిక్స్‌కు అత్యంత సహజమైన ఫలితాలను ఇస్తాయి. దీనివల్ల భవిష్యత్తులో మనుషుల మాదిరిగానే ఇంట్లో పనులు చేసే రోబోలను తయారు చేయడానికి ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతోంది.
చెన్నైలోనే కాకుండా భారతదేశంలోని పలు నగరాల్లో వేలాది మంది ఇలాంటి డేటా సేకరణ పనుల్లో భాగస్వాములవుతున్నారు. కేవలం ఇళ్లలోనే కాకుండా ఫ్యాక్టరీలు, ప్రత్యేక స్టూడియోలలో కూడా మనుషుల రోజువారీ శారీరక కదలికలను రికార్డ్ చేస్తున్నారు.
దీనిపై సదరు చెన్నై గృహిణి మాట్లాడుతూ… “రోజూ ఎలాగూ చేసుకునే ఇంటి పనులనే రికార్డ్ చేస్తూ గంటకు రూ.250 వరకు సంపాదించడం ఒక సరికొత్త, ఉపయోగకరమైన అనుభవం” అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ, రోబోటిక్స్ రంగాలు శరవేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత రోజుల్లో, భారతీయుల నిత్య జీవితం గ్లోబల్ టెక్నాలజీకి శిక్షణా డేటాగా మారడం విశేషం.
