టర్కీ దేశంలోని అంకారా (Ankara) ప్రావిన్స్ గోల్‌బాసి (Golbasi) జిల్లాలో, ఓ తల్లి తన 3 ఏళ్ల చిన్నారిని నడిరోడ్డుపై కనికరం లేకుండా దారుణంగా కొడుతూ చిత్రహింసలకు గురిచేసింది.
ఈ షాకింగ్ ఘటనను అక్కడున్న ఒకరు తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో, ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయి ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.
వీడియో ఆధారంగా వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ఘటనా స్థలంలో ఉన్న లగ్జరీ కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను గుర్తించారు. కారు యజమాని వివరాలను పరిశీలించగా, చిన్నారిపై దాడి చేసిన మహిళ పేరు ‘ఏ.ఎం’ (A.M) అని, ఆమె ఆ చిన్నారి కన్నతల్లి అని నిర్ధారణ అయింది.
ఆ తర్వాత, నిందితురాలైన ఆ తల్లి ఆచూకీ కనుక్కున్న పోలీసులు నేరుగా ఆమె ఇంటికే వెళ్లి అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లో ప్రాథమిక విచారణ పూర్తయిన వెంటనే ఆమెను స్థానిక కోర్టులో హాజరుపరిచారు.
ఈ కేసును విచారించిన న్యాయస్థానం, కన్న బిడ్డపైనే ఇంతటి కిరాతకంగా దాడి చేసిన ఆ మహిళను జైలుకు పంపాలని ఆదేశించింది. అలాగే, తల్లి చేతిలో దారుణ దాడికి గురైన ఆ 3 ఏళ్ల చిన్నారిని రక్షించి, ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి అప్పగించారు.

Leave a Reply