ఇంటికి చుట్టాలు, స్నేహితులు వచ్చినప్పుడు లేదా శుభకార్యాల్లో పిల్లలు అందరి దృష్టినీ ఆకర్షించడం సహజం. అయితే ఆ సమయంలో ఇతరుల ముందు పిల్లల గురించి మాట్లాడేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి:
- నెగెటివ్ ముద్రలు వేయకండి: “వీడికి సిగ్గు ఎక్కువ”, “ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు”, “చదువు అబ్బదు” అంటూ నలుగురిలో పిల్లలను తక్కువ చేసి మాట్లాడకండి.
- ఇతరులతో పోల్చకండి: పక్కింటి పిల్లలతోనో లేదా బంధువుల పిల్లలతోనో పోల్చి మాట్లాడటం వల్ల వారిలో న్యూనతాభావం ఏర్పడుతుంది.
- అందరి ముందూ తిట్టకండి: బంధువుల ముందే పిల్లలపై అరవడం, కొట్టడం లేదా వారి తప్పులను బహిరంగంగా ఎత్తిచూపి అవమానించడం మంచి పద్ధతి కాదు. ఏదైనా తప్పు చేస్తే పక్కకు తీసుకెళ్లి ప్రశాంతంగా అర్థమయ్యేలా చెప్పండి.
- ఎగతాళి చేయకండి: పిల్లల అలవాట్లు, మాటలు లేదా భయాలను నలుగురిలో నవ్వులపాలు చేస్తూ జోకులు వేయకండి.
- బలవంతం పెట్టకండి: నలుగురి ముందు పాటలు పాడమని, డ్యాన్సులు వేయమని లేదా మాట్లాడమని వారికి ఇష్టం లేకపోయినా బలవంతం చేయవద్దు.
పిల్లలు ఎదుగుతున్న సమయంలో తల్లిదండ్రులు మాట్లాడే మాటలు, వారి ప్రవర్తనే పిల్లల ఆత్మవిశ్వాసానికి పునాది. కాబట్టి నలుగురిలో పిల్లలకు గౌరవం ఇస్తూ, వారి మనోభావాలను అర్థం చేసుకుని పెంచడం ఎంతో ముఖ్యం.
