ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బదౌన్ జిల్లాలో ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన 27 ఏళ్ల మహిళ, ఆ తర్వాత పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
కరౌలియా గ్రామానికి చెందిన ఏక్తా సాగర్ అనే మహిళకు నలుగురు పిల్లలు జన్మించగా, వారిలో ఒక మగబిడ్డ కడుపులోనే కన్నుమూశాడు. మరో మగబిడ్డ, ఇద్దరు ఆడబిడ్డలు ప్రాణాలతో జన్మించారు. అయితే, ప్రసవం తర్వాత తల్లి ఆరోగ్యం క్షీణించి మృతి చెందింది. కాగా, ప్రాణాలతో పుట్టిన ముగ్గురు పిల్లలు కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి వారిని ఇంటికి పంపించారు.
ఏక్తా తన భర్త రాంబాబుతో కలిసి గత మంగళవారం సాయంత్రం అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం బదౌన్‌లోని సుధీర్ నర్సింగ్ హోమ్‌కు వెళ్లింది. అక్కడ పరీక్షించిన డాక్టర్ లతిక ఫోగట్.. ఏక్తా గర్భంలో నలుగురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే, ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెంటనే ఆసుపత్రిలో చేర్పించి ప్రసవం చేయాలని సూచించారు. అప్పటికే నలుగురు పిల్లలలో ఒకరు కడుపులోనే మరణించినట్లు కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. దీంతో డాక్టర్ల సలహా మేరకు ఏక్తాను ఆసుపత్రిలో చేర్పించారు.
మంగళవారం రాత్రి సిజేరియన్ (శస్త్రచికిత్స) ద్వారా ఆమెకు ప్రసవం చేశారు. ఇందులో ఒక మగబిడ్డ మృతశిశువుగా పుట్టాడు. మరో మగబిడ్డ, ఇద్దరు ఆడబిడ్డలు ప్రాణాలతో జన్మించారు. మొదట్లో ఏక్తా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. కానీ ఆ తర్వాత ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి పరిస్థితి విషమించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆమెను బరేలీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఏక్తా కన్నుమూసినట్లు సమాచారం.
మరోవైపు, ప్రాణాలతో జన్మించిన ముగ్గురు పసికందులను మొదట్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆ తర్వాత వారి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టారన్న సంతోషంలో ఉన్న ఆ కుటుంబానికి, తల్లిని, ఒక బిడ్డను కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఈ ముగ్గురు పిల్లల భవిష్యత్తు, పెంపకం బాధ్యత ఆ కుటుంబం ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది.

Leave a Reply