తిమింగలాల ప్రోటీన్‌తో 200 ఏళ్ల ఆయుష్షు సాధ్యమేనా? అమెరికా శాస్త్రవేత్తల సరికొత్త అధ్యయనం!

న్యూయార్క్: తిమింగలాల్లో కనిపించే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్, మానవులు 200 సంవత్సరాల వరకు జీవించడానికి సహాయపడుతుందా అనే అంశంపై అమెరికా పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. సుమారు 200 ఏళ్ల పాటు జీవించగలిగే, వ్యాధులపై అసాధారణ రోగనిరోధక శక్తిని కలిగిన ‘బోహెడ్’ (Bowhead) అనే తిమింగలాన్ని పరిశోధన వస్తువుగా తీసుకున్న శాస్త్రవేత్తలు, వాటి విశిష్ట జీవశాస్త్రం మానవులకు కూడా వర్తిస్తుందా అని పరీక్షిస్తున్నారు.

డీఎన్‌ఏ డ్యామేజ్‌కు విరుగుడు: సాధారణంగా మనుషుల్లో ఆయుష్షు తగ్గడానికి డీఎన్‌ఏ (DNA) దెబ్బతినడమే ప్రధాన కారణం. అయితే, డీఎన్‌ఏ దెబ్బతినకుండా కాపాడే ‘CIRBP’ అనే ప్రోటీన్ ఇతర క్షీరదాలతో పోలిస్తే ఈ బోహెడ్ తిమింగలాల్లో 100 రెట్లు ఎక్కువగా ఉంది.

ప్రయోగశాల ఫలితాలు: ఇటీవల ప్రయోగశాలలో మానవ కణాలు మరియు పండ్ల ఈగల (Fruit flies) కణాలలోకి ఈ ప్రోటీన్‌ను ప్రవేశపెట్టినప్పుడు, డీఎన్‌ఏ మరమ్మతు ప్రక్రియ గణనీయంగా మెరుగుపడిందని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాకుండా, ఈ ప్రోటీన్ ప్రభావంతో పండ్ల ఈగల జీవితకాలం కూడా పెరగడం గమనార్హం.

జీవనశైలిలో మార్పులు: ఈ తిమింగలాలు అత్యంత శీతల సముద్రాలలో నివసిస్తాయి. తక్కువ ఉష్ణోగ్రత ఉన్న చోట ఈ ప్రోటీన్ మరింతగా వృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపథ్యంలో, మానవులలో సహజంగా ఈ ప్రోటీన్ స్థాయిని పెంచడానికి ‘చన్నీళ్ల స్నానం’ (Cold water bath) వంటి జీవనశైలి మార్పులు ఏమైనా దోహదపడతాయా అనే కోణంలో కూడా అధ్యయనం జరుగుతోంది.


Posted

in

by

Tags: