తిరుచ్చి: తమిళనాడులోని తిరుచ్చి జంక్షన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ లాడ్జీలో అరియమంగళం ప్రాంతానికి చెందిన యాస్మిన్ అనే యువతి, తన ప్రియుడితో కలిసి గది అద్దెకు తీసుకుని బస చేసింది.
అక్కడ ఆమెకు డ్రగ్ ఇంజెక్షన్ ఇవ్వడంతో యాస్మిన్ మృతి చెందింది. ఈ కేసులో యువతి ప్రియుడు, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తిరుచ్చి అరియమంగళానికి చెందిన జాకీర్ హుస్సేన్ కుమారుడు సద్దాం హుస్సేన్ (19). ఇతను అదే ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఆజాద్ కుమార్తె యాస్మిన్ (19) అనే యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ జూన్ 7న తిరుచ్చి జంక్షన్ రౌండానా సమీపంలోని ఒక లాడ్జీలో గది తీసుకుని దిగారు.
జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో యాస్మిన్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. వెంటనే సద్దాం హుస్సేన్ తన స్నేహితుడైన షేక్ అబ్దుల్లా (19) సహాయంతో యాస్మిన్‌ను తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు, ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న కంటోన్మెంట్ పోలీసులు యాస్మిన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
పోలీసుల ప్రాథమిక విచారణ: ప్రియుడిని నమ్మి వచ్చిన యాస్మిన్‌కు.. ఆమె ప్రియుడు సద్దాం హుస్సేన్, అతని స్నేహితుడు షేక్ అబ్దుల్లా ఇద్దరూ కలిసి ‘టెపెంటాడాల్’ (Tapentadol) అనే మత్తు మాత్రలను నీటిలో కరిగించి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చారని, మోతాదుకు మించి డ్రగ్స్ శరీరంలోకి చేరడం వల్లే యాస్మిన్ మరణించిందని పోలీసుల విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సదరు లాడ్జీకి వెళ్లి తనిఖీలు చేపట్టారు.
లాడ్జీ గది నుండి యాస్మిన్‌కు ఉపయోగించిన డ్రగ్స్ మాత్రల స్ట్రిప్స్, ఇంజెక్షన్ సిరంజిని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించిన వాటిలో 10 మాత్రల చొప్పున ఉన్న 7 టెపెంటాడాల్ మాత్రల స్ట్రిప్స్, ఒక సిరంజి, మాత్రలు కరిగించిన స్థితిలో ఉన్న 2 టీ కప్పులు, 3 సిగరెట్ ముక్కలు, ఒక సెల్‌ఫోన్ ఉన్నాయి.
మత్తు మాత్రల దందాపై సంచలన నిజాలు: ఈ కేసులో నిందితులైన సద్దాం హుస్సేన్, షేక్ అబ్దుల్లాను కంటోన్మెంట్ పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా మత్తు మాత్రల విక్రయాల గురించిన షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సద్దాం కుటుంబానికి చెందిన షకీలా బేగం, ఆమె కుమారుడు జాకీర్ హుస్సేన్ గతంలోనే మత్తు మాత్రలు విక్రయిస్తూ అరియమంగళం పోలీసులకు దొరికిపోయి, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా, మరణించిన యాస్మిన్ కూడా ఆన్లైన్ ద్వారా మత్తు మాత్రలను విక్రయించేదని సమాచారం వచ్చింది. వీరికి ఈ మత్తు మాత్రలను సరఫరా చేస్తోంది ఎవరు? ఈ డ్రగ్స్ నెట్వర్క్ వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply