ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో తీవ్రమైన చలి గాలుల మధ్య ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. యూపీ రోడ్‌వేస్ బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి సీట్లోనే కూర్చుని ప్రాణాలు విడిచాడు. అయితే, విచారకరమైన విషయం ఏంటంటే.. ప్రయాణం అంతా పూర్తయ్యే వరకు పక్కన ఉన్న ప్రయాణికులకు గానీ, సిబ్బందికి గానీ అతను చనిపోయాడనే విషయం తెలియలేదు.
అందిన సమాచారం ప్రకారం, ఈ ఘటన శనివారం ఉదయం జరిగింది. బస్సు ‘లఖహు మోడ్’ బస్టాండ్‌కు చేరుకున్నప్పుడు ప్రయాణికులందరూ దిగిపోయారు. కానీ ఆ వ్యక్తి మాత్రం తన సీట్లోనే కూర్చుని ఉన్నాడు. బస్సు కండక్టర్ అతడిని దిగమని చెప్పడానికి వెళ్లి నిమషంగా తాకగా, అతని శరీరంలో ఎటువంటి కదలిక లేదు. దీంతో కండక్టర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
బస్టాండ్‌లో కలకలం
ఈ విషయం తెలియగానే బస్టాండ్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. మృతుడిని గుర్తించడానికి అతని ఫోటోను వైరల్ చేశారు. అనంతరం బస్సును సమీపంలోని లార్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కి తరలించగా, పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. లార్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సంతోష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు ఛోటేలాల్ పాశ్వాన్ (45 ఏళ్లు). ప్రాథమిక విచారణలో గుండెపోటు (Heart Attack) కారణంగానే అతను మరణించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు పోస్ట్‌మార్టంకు నిరాకరించడంతో పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని వారికి అప్పగించారు.
డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా..
మృతుడు ఛోటేలాల్ పాశ్వాన్ లార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోన్రాబారి నివాసి. ఆయన దేవరియా పట్టణంలోని ఒక పెట్రోల్ బంక్‌లో మేనేజర్‌గా పనిచేసేవారు. శనివారం ఉదయం డ్యూటీ ముగించుకుని తన ఇంటికి వెళ్లడానికి యూపీ రోడ్‌వేస్ బస్సు ఎక్కారు. కండక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. రావత్పార్ గేట్ సమీపంలో ఛోటేలాల్కు టికెట్ చిల్లర కూడా తిరిగి ఇచ్చారు. ఆ సమయంలో ఆయన చాలా ఆరోగ్యంగానే కనిపించారు. కానీ ఆ తర్వాత అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి బస్సులోనే తుదిశ్వాస విడిచారు.
కుటుంబంలో విషాదఛాయలు
లార్ CHC సూపరింటెండెంట్ ప్రకారం, మరణానికి కారణం గుండెపోటు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కావచ్చు. ఈ సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భార్య, పిల్లల రోదనలు అక్కడి వారిని కలిచివేస్తున్నాయి. ఈ ఆకస్మిక మరణంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
