ఇంటి అందాన్ని పెంచుకోవడానికి, సువాసనల కోసం మనం ఎంతో ఇష్టపడి పెంచుకునే కొన్ని మొక్కలే, విషసర్పాలను మనకు తెలియకుండానే ఇంట్లోకి రప్పించే ప్రమాదకరమైన ఆకర్షణలుగా మారవచ్చని వృక్షశాస్త్ర, వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా, రాత్రి వేళల్లో విపరీతమైన సువాసన వెదజల్లే కొన్ని రకాల మొక్కలు పాములకు నివాస స్థావరాలుగా, వాటిని ఆకర్షించే కేంద్రాలుగా మారుతున్నాయి. అందం కోసం, పరిమళం కోసం ఇంటి గుమ్మం ముందో లేదా తోటలోనో మనం పెంచే ఆ ఒక్క మొక్క… పాములకు రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించినట్లే అవుతుంది.
రాత్రిపూట తీవ్రమైన సువాసన ఇచ్చే నైట్ క్వీన్ / పారిజాతం వంటి దట్టమైన జాతులు వంటి మొక్కలు, పొదలు పాములను నేరుగా ఆకర్షించకపోయినప్పటికీ… ఆ పరిమళానికి ఆకర్షితులై వచ్చే కప్పలు, బల్లులు, కీటకాలు, ఎలుకల వంటి చిన్న జీవులను వేటాడేందుకు పాములు ఈ మొక్కల వద్దకు చేరుకుంటాయి.
అంతేకాకుండా, ఈ మొక్కలు దట్టంగా పెరిగి రాత్రి వేళల్లో చల్లని వాతావరణాన్ని అందించడం వల్ల, పాములు తమను తాము దాచుకుని విశ్రాంతి తీసుకోవడానికి వీటిని అనువైన ఆవాసాలుగా ఎంచుకుంటాయి. దీనివల్ల ఇంటి పరిసరాల్లో ఇలాంటి మొక్కలు ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో పాముల సంచారం గణనీయంగా పెరుగుతుంది.
కాబట్టి, పెరటి తోటలు ఉన్నవారు, ఇంటి చుట్టూ మొక్కలు పెంచేవారు ఇటువంటి దట్టమైన మొక్కలను ఇంటి ప్రధాన ద్వారానికి లేదా గుమ్మానికి అతి సమీపంలో పెంచడాన్ని నివారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఒకవేళ ఇలాంటి మొక్కలను పెంచుకున్నా, వాటిని ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ (ట్రిమ్ చేస్తూ) శుభ్రంగా ఉంచాలి. మొక్కల మొదళ్ల వద్ద చీకటి లేదా చెత్తాచెదారం పేరుకుపోకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ, తోట ఉన్న ప్రాంతాల్లో రాత్రి వేళల్లో తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవడం వల్ల ఊహించని పాముకాటు ప్రమాదాల నుంచి మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
