సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ప్రచారం చేసే సౌందర్య సాధనాలను (కాస్మెటిక్స్) గుడ్డిగా నమ్మి కొనుగోలు చేసే ధోరణి యువతలో పెరిగిపోతోంది. తక్షణమే రంగు మారుస్తామని చెప్పే ఇలాంటి నాసిరకం క్రీముల్లోని రసాయనాలను పరిశీలించకుండా వాడటం ప్రాణాలకే ప్రమాదంగా మారవచ్చనే దానికి కేరళలో జరిగిన ఓ ఘటన నిదర్శనంగా నిలిచింది.
కేరళలోని మలప్పురంకు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోలను నమ్మి మొటిమలు, నల్ల మచ్చలను తొలగించే ఫెయిర్‌నెస్ క్రీమ్‌ను వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసింది. దాదాపు ఏడాది పాటు దానిని నిరంతరం వాడటంతో, అకస్మాత్తుగా లో బీపీ, తలతిరగడం, కాళ్లలో వాపు వచ్చి నడవలేని స్థితికి చేరుకుంది. దీంతో ఆమెను మలప్పురంలోని ఆస్టర్ మిమ్స్ మదర్ ఆసుపత్రిలో చేర్చారు.
డాక్టర్ గౌరి ఎస్ నిర్వహించిన పరీక్షల్లో ఆ విద్యార్థిని శరీరంలో పాదరసం (మెర్క్యురీ) అధిక స్థాయిలో ఉన్నట్లు, ఆమెకు ‘మెంబ్రేనస్ నెఫ్రోపతి’ అనే తీవ్రమైన కిడ్నీ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ క్రీమ్‌లో అనుమతించిన 1 ppm పరిమితి కంటే అనేక రెట్లు ఎక్కువగా 12,500 ppm పాదరసం కలిపినట్లు గుర్తించారు. దీనిపై సదరు సంస్థ స్పందించకుండా తప్పించుకోవడంతో విద్యార్థిని కుటుంబం వినియోగదారుల కోర్టును ఆశ్రయించనుంది. మరోవైపు, కేరళ బాలల హక్కుల కమిషన్ కూడా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. దీనిపై ఆరోగ్య శాఖ, పోలీసులు మరియు డ్రగ్స్ కంట్రోల్ విభాగాలను వివరణ కోరింది.
ఇలాంటి విషపూరిత రసాయనాలు కలిగిన క్రీములను వాడటం వల్ల కిడ్నీల వడపోత సామర్థ్యం శాశ్వతంగా దెబ్బతిని ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల, తక్షణ అందాన్ని ఇస్తామని చెప్పే ఆన్‌లైన్ ప్రకటనలను నమ్మి మోసపోకుండా, చర్మ సమస్యలకు అర్హత కలిగిన చర్మ వ్యాధి నిపుణులను (డెర్మటాలజిస్ట్) సంప్రదించి చికిత్స తీసుకోవడమే సురక్షితమని సూచిస్తున్నారు.

Leave a Reply