తెల్లవారుజామున ప్రియుడి ఇంటికి వెళ్లిన మాజీ ఎస్సై కుమార్తె హత్య.. కళ్ళముందే చంపేసి పాతిపెట్టిన భార్య…

తూత్తుకుడి: తమిళనాడులోని తూత్తుకుడి శంకరపేరి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) సెల్లదురై కుమార్తె బృందాదేవి (34) దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో పొరుగునే నివసించే మరిముత్తు (42), అతని భార్య శరవణప్రియ (34)లను పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగింది?
బృందాదేవి భర్త కృష్ణకుమార్ కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పొరుగునే వెల్డింగ్ కాంట్రాక్ట్ వ్యాపారం చేసే మరిముత్తుతో బృందాదేవికి వివాహేతర సంబంధం ఏర్పడింది. నిన్నటి నుంచి బృందాదేవి కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీసీటీవీ కెమెరాలే కీలకం:
పోలీసులు బృందాదేవి ఇంటి ముందున్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. తెల్లవారుజామున 5:20 గంటల ప్రాంతంలో మరిముత్తు తన ఇంటి తలుపులు తెరిచి ఉంచడం, ఆ వెంటనే బృందాదేవి అతని ఇంట్లోకి వెళ్లడం రికార్డయ్యింది. దీని ఆధారంగా మరిముత్తు దంపతులను విచారించగా అసలు నిజం బయటపడింది.

పోలీసు విచారణలో వెల్లడైన వివరాలు:
మరిముత్తు భార్య శరవణప్రియ, పిల్లలు పక్క గదిలో నిద్రపోతుండగా, మరిముత్తు బృందాదేవి కోసం తలుపులు తెరిచి ఉంచాడు. కొద్దిసేపటికే ఆమె రావడంతో ఇద్దరూ మరో గదిలో ఏకాంతంగా గడుపుతున్నారు. ఇది చూసిన శరవణప్రియ వారితో గొడవకు దిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన శరవణప్రియ, భర్త కళ్ళముందే బృందాదేవిపై దాడి చేసి, దిండుతో ముఖాన్ని అదిమి పట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది.

మృతదేహం మాయం:
హత్య అనంతరం మరిముత్తు సహాయంతో మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కట్టారు. శరవణప్రియ తమ్ముడు కార్తీక్ సహాయంతో మృతదేహాన్ని కారులో ఓట్టపిడారం సమీపంలోని తమ సొంత పొలానికి తీసుకెళ్లి గొయ్యి తీసి పాతిపెట్టారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న కార్తీక్ కోసం గాలిస్తున్నారు.


Posted

in

by

Tags: