ముంబైకి చెందిన ఒక మహిళ తన కుటుంబానికి ఎదురైన వైద్య అత్యవసర పరిస్థితిలో బ్లింకిట్ అంబులెన్స్ సర్వీస్ చేసిన సహాయాన్ని కొనియాడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెల్లవారుజామున తన అత్తను ఆసుపత్రికి చేర్చడంలో ఈ సేవ ఎంతో కీలక పాత్ర పోషించిందని ప్రాచి అనే మహిళ పేర్కొన్నారు.
వేకువజామున ఢిల్లీ నుండి అత్యవసర పిలుపు ప్రాచి తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఢిల్లీలో ఉంటున్న తన తల్లిదండ్రుల నుండి ఆమెకు ఫోన్ వచ్చింది. వారితో పాటే ఉంటున్న ఆమె అత్తకు అకస్మాత్తుగా ఫిట్స్ (Seizure) రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అయితే, ఎన్నిసార్లు ప్రయత్నించినా క్యాబ్‌లు ఆలస్యమవ్వడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బంది పడింది. “ముంబైలో ఉంటూ ఢిల్లీలో ఉన్న నా కుటుంబం పడుతున్న కష్టాన్ని చూసి ఏమీ చేయలేక చాలా నిస్సహాయంగా అనిపించింది” అని ఆమె తన ఆవేదనను పంచుకున్నారు.
సమయానికి ఆదుకున్న బ్లింకిట్ అంబులెన్స్ ఆ సమయంలో ప్రాచి భర్త ఆమెకు బ్లింకిట్ కొత్తగా ప్రారంభించిన అంబులెన్స్ ఫీచర్ గురించి గుర్తుచేశారు. వెంటనే ఆమె ముంబై నుండే ఢిల్లీలోని తన అత్త కోసం అంబులెన్స్‌ను బుక్ చేశారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్ అక్కడికి చేరుకుంది.
అన్నింటికంటే ఆమెను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. ఈ సేవకు బ్లింకిట్ ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదు. కేవలం “నిజమైన అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంబులెన్స్‌ను కోరండి” అనే సందేశం మాత్రమే అందులో కనిపించింది. సమయానికి అంబులెన్స్ అందడం వల్ల తాను ఎంతో ఊరట పొందానని, తాను అక్కడ లేకపోయినా కుటుంబానికి సహాయపడగలిగానని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
అత్యవసర సేవల్లో క్విక్-కామర్స్ పాత్ర నిత్యావసర వస్తువుల డెలివరీకి పేరుగాంచిన బ్లింకిట్, ఇప్పుడు ఎంపిక చేసిన నగరాల్లో అంబులెన్స్ వంటి అత్యవసర సేవలను కూడా అందిస్తోంది. ముఖ్యంగా రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండే సమయాల్లో ఇవి నగరవాసులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
