న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ (Mehrauli) పరిధిలో గల మెట్రో స్టేషన్ సమీపంలో.. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న 10 ఏళ్ల మైనర్ బాలికను సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. ఆపై ఆమెపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడి, గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు.
ఆపై ఆధారాలు దొరకకుండా ఉండేందుకు బాలిక మృతదేహాన్ని గురుగ్రామ్ – ఫరీదాబాద్ సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో పడేసి పరారయ్యాడు. బిహార్ రాష్ట్రానికి చెందిన ఈ పేద కుటుంబం ఉపాధి కోసం నాలుగు నెలల క్రితమే ఢిల్లీకి వలస వచ్చింది. స్థిరమైన ఆదాయం, ఇల్లు లేకపోవడంతో వారు రోడ్డు పక్కనే నివసిస్తున్నారు. ఓ స్థానిక మహిళ సహాయంతో ఆ బాలికను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.
“నాన్న కాపాడు” – కర్రతో కారు వెనుక పరిగెత్తిన తండ్రి:
ఘటన జరిగిన రోజు తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో.. “నాన్న… నన్ను కాపాడు” అంటూ ఆ పసిపాప పెట్టిన భయానక ఆర్తనాదం విని తండ్రి ఉలిక్కిపడి లేచాడు. కళ్లెదుటే కూతురిని కారులోకి లాక్కెళ్లడం చూసి, చేతిలోకి ఒక కర్రను తీసుకుని కారు వెనుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాడు. కానీ, దురదృష్టవశాత్తూ అతడు ఆ వేగవంతమైన కారును ఆపలేకపోయాడు.
తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ (CCTV) ఫుటేజీలు, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ మరియు జీపీఎస్ (GPS) ట్రాకింగ్ సహాయంతో కేవలం గంటల వ్యవధిలోనే.. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పశ్చిమ ఢిల్లీలోని వికాస్‌పురిలో ప్రయాణికులను దింపుతున్న నిందితుడైన కారు డ్రైవర్ పాషు కుమార్ సింగ్ ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిజాలు – పోస్ట్‌మార్టంలో భయానక విషయాలు:
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు మొదట నేరాన్ని తిరస్కరించినప్పటికీ.. థర్డ్ డిగ్రీ ఇచ్చేసరికి నిజం ఒప్పుకుని, మృతదేహాన్ని పడేసిన అడవి ప్రాంతాన్ని చూపించాడు. సోమవారం సాయంత్రం ఫోరెన్సిక్ బృందం సమక్షంలో బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోస్ట్‌మార్టం నివేదికలో బాలిక గొంతుపై గట్టిగా నొక్కిన తాడు తాలూకు గుర్తులు ఉన్నట్లు, అలాగే ఆమె ముఖం, తలపై రాళ్లతో, ఇటుకలతో విచక్షణారహితంగా బాదడం వల్ల తీవ్రమైన గాయాలైనట్లు వైద్యులు ధృవీకరించారు. మంగళవారం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడికి రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
సీన్ రీకన్స్ట్రక్షన్‌లో ఎన్‌కౌంటర్ – డీసీపీ ప్రకటన:
ఇదిలావుండగా, నిందితుడిని నేరం జరిగిన తీరును పరిశీలించేందుకు (క్రైమ్ సీన్‌కు) తీసుకెళ్లినప్పుడు.. అతడు పోలీసులపైనే దాడి చేసి, ఒక అధికారి తుపాకీని లాక్కొని కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడి కాలికి బుల్లెట్ గాయమైంది. ప్రస్తుతం అతడిని ఆసుపత్రిలో చేర్చి, పోలీసులపై దాడి చేసినందుకుగాను అదనంగా మరో కేసు నమోదు చేశారు.
ఈ సంచలన కేసుపై దక్షిణ ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమీషనర్ (DCC) ఆనంద్ మిట్టల్ మాట్లాడుతూ.. సీసీటీవీ విజువల్స్, మొబైల్ కాల్ డేటా రికార్డులు (CDR) మరియు ఫోరెన్సిక్ ఆధారాలను పక్కాగా సేకరిస్తున్నామని, నిందితుడికి త్వరితగతిన ఉరిశిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని తెలిపారు. అలాగే బాధిత పేద కుటుంబానికి అవసరమైన పూర్తి చట్టపరమైన, సామాజిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
