జుట్టు తెల్లబడటం (Grey Hairs) అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. తక్కువ వయస్సులోనే జుట్టు రాలడం, జుట్టు బలహీనపడటం వంటి సమస్యలు వస్తున్నాయి. తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి మార్కెట్లో అనేక హెయిర్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ, కెమికల్స్ ఉన్న హెయిర్ డైలను వాడటం వల్ల జుట్టు మరింత తెల్లబడటమే కాకుండా పాడైపోయే అవకాశం ఉంది.
జుట్టును సహజసిద్ధంగా నల్లగా మార్చుకోవడానికి మీరు ఇంట్లోనే కొన్ని సులభమైన చిట్కాలను పాటించవచ్చు. నేచురల్ హెయిర్ కలర్ వాడటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, వెంట్రుకల నాణ్యత కూడా పెరుగుతుంది.
పసుపుతో హెయిర్ డై తయారీ విధానం:
తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి మీకు 2 చెంచాల పసుపు అవసరం.
- ముందుగా ఒక ఇనుప కడాయి లేదా పాన్ తీసుకుని అందులో పసుపు వేసి వేయించాలి.
- పసుపును చాలా తక్కువ మంట మీద వేయించాలి, లేదంటే అది మాడిపోతుంది.
- పసుపు పూర్తిగా నల్లటి రంగులోకి మారే వరకు వేయించుకోవాలి. ఇందులో ఎలాంటి నూనె కలపకూడదు, పొడి పసుపునే వేయించాలి.
- పసుపు నల్లగా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
మిశ్రమం తయారీ:
- ఒక కప్పు నీటిలో 1 చెంచా టీ పౌడర్ వేసి బాగా మరిగించాలి. 4 నుండి 5 నిమిషాల తర్వాత నీరు సగానికి తగ్గినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఈ టీ డికాషన్‌లో వేయించిన నల్లటి పసుపు పొడిని కలపాలి.
- ఇందులో కొంచెం అలోవెరా జెల్ (కలబంద) మరియు ఒక విటమిన్ E క్యాప్సూల్ నూనెను కలపాలి.
- చివరగా ఇందులో 2 చెంచాల మెహందీ (గోరింటాకు పొడి) కలపాలి. మెహందీ పొడి తాజాగా ఉంటే జుట్టుకు రంగు బాగా పడుతుంది.
ఎలా వాడాలి?
ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. సుమారు 2 గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. జుట్టు ఆరిపోకుండా షవర్ క్యాప్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత సాధారణ నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. పసుపు, టీ పౌడర్, మెహందీ మరియు అలోవెరా జెల్ కలిపిన ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి వాడటం వల్ల జుట్టు సహజంగా నల్లగా మారుతుంది.
