భారత టీ20 క్రికెట్ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ స్థానంపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు. దీంతో అతనికి నిరంతరం అవకాశాలు ఇవ్వాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు తెలుపుతూ వచ్చాడు. కానీ, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతని బ్యాటింగ్ ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో, జట్టులో అతని స్థానంపై మళ్లీ చర్చ మొదలైంది.
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తొలి పోరులో సంజు శాంసన్ 67 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. కానీ ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఆ నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి చేసిన పరుగులు.. తొలి మ్యాచ్‌లో అతను సాధించిన 67 పరుగులకు కూడా సరితూగలేదు. చివరి టీ20లో 10 బంతులు ఎదుర్కొన్న సంజు.. కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో ఈ సిరీస్‌ను అతను తీవ్ర నిరాశతో ముగించాడు.
హామిల్టన్‌లోని సెడాన్ పార్క్ మైదానంలో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ అభిషేక్ శర్మ ఔట్ కావడంతో, జట్టుకు శుభారంభం అందించాల్సిన బాధ్యత సంజు శాంసన్‌పై పడింది. కానీ, అతను పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. బంతిని సరిగ్గా ఎదుర్కోలేక తడబడిన అతను.. నాలుగో ఓవర్ తొలి బంతికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లోని ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 107 పరుగులు మాత్రమే చేసిన సంజు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా తొలి మ్యాచ్ మినహా మరే మ్యాచ్‌లోనూ అతను కనీసం 20 పరుగుల మార్కును కూడా దాటలేదు.
మరోవైపు, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం రాకపోవడం పైనా క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఓపెనర్ల జోడీ స్థిరంగా ఉండటం వల్లే అతనికి అవకాశం ఇవ్వలేకపోతున్నారని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సంజు శాంసన్‌కు పదే పదే అవకాశాలు ఇవ్వడం సబబేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. 2026 సంవత్సరంలో భారత జట్టు తరఫున 30 మ్యాచ్‌లలో 810 పరుగులు చేసిన సంజు, అత్యధిక పరుగులు చేసిన భారతీయ ఆటగాళ్లలో మూడో స్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ, విదేశీ మైదానాల్లో అతని ప్రదర్శన ఆందోళనకరంగా ఉంది. భారత్ వెలుపల 12 ఇన్నింగ్స్‌లు ఆడిన అతను కేవలం 13 పరుగుల సగటుతో 158 పరుగులు మాత్రమే చేశాడు. 2028 టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో, అలాగే ఒలింపిక్ క్రీడలు అమెరికాలో జరగనున్న నేపథ్యంలో.. విదేశీ పిచ్‌లపై అద్భుతంగా రాణించగల ప్రత్యామ్నాయ ఆటగాళ్లను భారత జట్టు ఇప్పటి నుంచే సిద్ధం చేయాలా అన్న చర్చ మొదలైంది.

Leave a Reply