బెంగళూరులోని శివాజీ నగర్ ప్రాంతంలో రోడ్డు పక్కన గోమాంసాన్ని కోసి, వండి విక్రయిస్తున్నట్లుగా బయటకు వచ్చిన ఓ వీడియో నెట్టింట తీవ్ర కలకలం రేపింది. ‘క్రిస్ ట్రావెల్స్’ అనే సోషల్ మీడియా పేజీలో కంటెంట్ షేర్ చేసే ఓ వ్యక్తి విడుదల చేసిన ఈ వీడియోలో, మాంసం దుకాణం సమీపంలో గర్భంతో ఉన్నట్లు భావిస్తున్న ఓ ఆవు పడుకుని ఉండటం రికార్డయింది. అనంతరం మార్కెట్ లోపలికి వెళ్లిన అతడు, అక్కడ మాంసం ముక్కలు వేలాడదీసి ఉండటాన్ని, వినియోగదారులకు విక్రయిస్తుండటాన్ని చిత్రీకరించాడు.
అంతేకాకుండా, రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లో మాంసం వండుతుండటాన్ని కూడా చూపించాడు. ఆ సమయంలో అది మటనా లేక చికెనా అని ప్రశ్నించగా, అది గోమాంసమని విక్రేతలు చెప్పినట్లు వీడియోలో ఉంది. అక్కడున్న ఆవు గురించి అడగ్గా, త్వరలోనే దానిని కోసేస్తామని విక్రేతలు సమాధానమిచ్చినట్లు ఆ వీడియోలో పేర్కొన్నారు.
ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా గర్భంతో ఉన్నట్లు చెబుతున్న ఆ ఆవును వెంటనే రక్షించి, భద్రత కల్పించాలని పలువురు బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేస్తూ డిమాండ్ చేశారు. ‘గౌ గ్యాన్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఇదే వీడియోను షేర్ చేస్తూ, శివాజీ నగర్‌లోని రస్సెల్ మార్కెట్ వెనుక భాగంలో ఈ ఘటన జరిగిందని పేర్కొంది.
అలాగే, కర్ణాటకలో అమల్లో ఉన్న 2020 నాటి గోవధ నిషేధం, పశుసంరక్షణ చట్టాన్ని గుర్తుచేస్తూ చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో బెంగళూరు నగర పోలీసులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, ఈస్ట్ జోన్ డీసీపీ, శివాజీ నగర్ పోలీసులు, నగరపాలక సంస్థ జంతు సంక్షేమ విభాగాన్ని విచారణ జరపాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా, గురువారం రాత్రి శివాజీ నగర్ పోలీసులు తమ సోషల్ మీడియా ఖాతాలో ఒక కీలక సమాచారాన్ని పంచుకున్నారు. దీని ప్రకారం, తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెత్తకుప్ప సమీపంలో పడుకుని ఉన్న ఆవును గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దానిని సురక్షితంగా రక్షించారు.
అనంతరం ఆ ఆవుకు మెరుగైన సంరక్షణ, పోషకాహారం అందించేందుకు మహాదేవపుర ప్రాంతంలోని గోశాలకు తరలించినట్లు వెల్లడించారు. అయితే, వీడియోలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాంసం మార్కెట్ లేదా దాని యజమానులపై తీసుకున్న చర్యల గురించి పోలీసుల ప్రకటనలో ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఆవును రక్షించడం ఒకవైపు ఆనందాన్ని కలిగించినా, మాంసం మార్కెట్‌పై వచ్చిన ఆరోపణలపై ఏం చర్యలు తీసుకున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Leave a Reply