కర్ణాటక: ధార్వాడ్ జిల్లా హుబ్బళ్ళి తాలూకా ఇనాం వీరాపుర గ్రామంలో ఆదివారం సాయంత్రం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. అంతర్జాంతీ వివాహం చేసుకుందనే కోపంతో కన్న తండ్రే తన కుమార్తెను అతి దారుణంగా హత్య చేశాడు.
ప్రేమ వివాహం: ఇనాం వీరాపుర గ్రామానికి చెందిన వివేకానంద మరియు మాన్య గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మాన్య లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యువతి కాగా, వివేకానంద దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు. వీరిద్దరూ డిగ్రీ చదువుతున్న సమయంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. అయితే, మాన్య పట్టుబట్టి గత జూన్ 19న హుబ్బళ్ళిలో వివేకానందను రిజిస్టర్ వివాహం చేసుకుంది.
పోలీసుల రాజీ ప్రయత్నం: పెళ్లి తర్వాత పోలీసులు రెండు కుటుంబాలను పిలిపించి రాజీ చేశారు. ఆ తర్వాత ఈ దంపతులు హవేరీలో నివాసం ఉండేవారు. ఈ క్రమంలో మాన్య గర్భవతి అయింది. అంతా సర్దుమణిగి ఉంటుందని భావించి డిసెంబర్ 8న ఈ దంపతులు తిరిగి తమ గ్రామానికి చేరుకున్నారు. మళ్ళీ గొడవలు మొదలవ్వడంతో పోలీసులు మరోసారి పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ కుదిర్చారు. కానీ, అప్పటికే తండ్రి మనసులో కక్ష పెంచుకున్నాడు.
ఇంట్లోకి చొరబడి దాడి: ఆదివారం సాయంత్రం మాన్య తండ్రి ప్రకాశగౌడ పాటిల్ మరియు అతని బంధువులు వివేకానంద ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న మాన్య, ఆమె అత్తమామలపై విచక్షణారహితంగా దాడికి దిగారు. ప్రకాశగౌడ తన కుమార్తె మాన్యపై పైపు మరియు పారతో (గుద్దలి) కిరాతకంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మాన్యను హుబ్బళ్ళిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మాన్య అత్తమామలు ప్రస్తుతం హుబ్బళ్ళి కిమ్స్ (KIMS) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ముగ్గురి అరెస్ట్: ఈ ఘటనపై సమాచారం అందుకున్న ధార్వాడ్ ఎస్పీ గుంజన్ ఆర్య ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు. హుబ్బళ్ళి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాన్య తండ్రి ప్రకాశగౌడ పాటిల్‌తో సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుని, గర్భవతిగా ఉన్న కుమార్తెను కన్న తండ్రే హత్య చేయడం స్థానికంగా పెను కలకలం రేపింది.
