తమిళనాడు తరహాలోనే కేరళ కూడా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో అక్కడ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ విజయం సాధిస్తుందనే అంశంపై ఒక సర్వే వెలువడింది. ఇందులో కాంగ్రెస్ కూటమికి భారీ మద్దతు లభిస్తున్నట్లు స్పష్టమైంది.
గత రెండు లోక్సభ ఎన్నికల్లో కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఆధిపత్యం చలాయిస్తోంది. 2019లో 20 స్థానాలకు గాను 19 చోట్ల, 2024లో 18 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. తాజాగా ఇండియా టుడే – సీ ఓటర్ నిర్వహించిన సర్వే ప్రకారం.. నేడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ తన 18 స్థానాలను నిలబెట్టుకుంటుందని తేలింది.
ఎడమపక్షాలకు ఎదురుదెబ్బ – బీజేపీకి ఊరట: మరోవైపు, గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎడమపక్ష కూటమి (LDF)పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వే చెబుతోంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎడమపక్షాలు ఒక్క సీటు కూడా గెలవకపోవచ్చని అంచనా వేయడం గమనార్హం.
అదే సమయంలో బీజేపీకి కొంత సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 2024లో ఒక స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ కూటమి, ఈసారి రెండు స్థానాల్లో విజయం సాధించవచ్చని సర్వే అంచనా వేసింది. బీజేపీ ఓట్ల శాతం 16% నుండి 25%కి పెరిగే అవకాశం ఉందని, ఇది ఆ పార్టీకి గణనీయమైన ఎదుగుదల అని పేర్కొంది.
జాతీయ స్థాయి అంచనాలు: జనవరి 2026 నాటి ఈ సర్వే ప్రకారం, నేడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమి 287 స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకుంటుందని తేలింది. ప్రధాని మోదీకి 57% మంది ప్రజలు మద్దతు తెలిపారు.
