బీహార్లోని మధుబని జిల్లాలో ఒక ముస్లిం మహిళపై మూక దాడి జరగడమే కాకుండా, ఆమెకు బలవంతంగా మద్యం, మూత్రం కలిపిన నీటిని తాగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళ మార్చి 1న చికిత్స పొందుతూ మరణించింది.
ఆమె ఆ సమయంలో రంజాన్ ఉపవాసంలో ఉన్నారు.
ఘటన నేపథ్యం: ఫిబ్రవరి 28న ఘోఘర్దిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్హి గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు రోషన్ ఖాతూన్గా గుర్తించబడింది. తన కుటుంబంలో తలెత్తిన ఒక స్థానిక వివాదంపై సహాయం కోరేందుకు ఆమె గ్రామాధికారి (సర్పంచ్) వద్దకు వెళ్లారు. అయితే, అక్కడ సర్పంచ్ కుమారుడు మన్ను సింగ్ ఆమెను ఒక స్తంభానికి కట్టేసి, ఆమెపై మరియు ఆమె కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.
అమానుషం: స్థానికుల కథనం ప్రకారం.. దాడి జరుగుతున్నప్పుడు ఖాతూన్ తనను వదిలేయమని వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఉపవాసంలో ఉన్న ఆమె దాహంతో నీళ్లు అడగగా, దుండగులు ఆమెకు బలవంతంగా మద్యం మరియు మూత్రం కలిపిన నీటిని తాగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, పోలీసులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. గ్రామస్తుల్లో అశాంతి కలిగించడానికే ఇటువంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) పేర్కొన్నారు.
పోలీసుల చర్యలు: ఫిబ్రవరి 28న ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. మొదట హత్యాప్రయత్నం (సెక్షన్ 109) కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఖాతూన్ మరణించిన తర్వాత దాన్ని హత్య కేసుగా (సెక్షన్ 103) మార్చారు. నిందితుడు మన్ను సింగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
