ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నితీష్ కుమార్ అనే వ్యక్తి, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు రూ.2 లక్షలకు పైగా సంపాదిస్తున్నానని సోషల్ మీడియాలో గొప్పగా వీడియో పెట్టిన 48 గంటల్లోపే, అతని ఛానల్ ఆదాయం పూర్తిగా ఆగిపోయిన ఘటన పెను సంచలనం సృష్టించింది.
నితీష్ కుమార్ ‘న్యూ బార్న్ వరల్డ్ టీవీ’ (New Born World TV) పేరుతో 91,000 మంది సబ్స్క్రైబర్లతో ఒక యూట్యూబ్ ఛానల్‌ను నడుపుతున్నాడు. అమెరికాలో ఎక్కువగా వీక్షించే ఈ ఛానల్ ద్వారా గత ఆగస్టు నెలలోనే అతను $2,394 (సుమారు రూ.2.29 లక్షలు) సంపాదించాడు. ఈ డబ్బును బ్యాంకు నుండి విత్‌డ్రా చేయడం గురించి సెప్టెంబర్ 23న అతను పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో 15 లక్షలకు పైగా వ్యూస్ సాధించి వైరల్‌గా మారింది.
అయితే, తన ఆదాయాన్ని గొప్పగా బయటపెట్టిన కేవలం రెండే రోజుల్లో, అంటే సెప్టెంబర్ 25న అతని యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ నిలిచిపోయి ఆదాయం సున్నాగా మారింది. దీంతో షాక్‌కు గురైన నితీష్, ఆధారాలతో సహా మరో వీడియోను విడుదల చేసి తన ఛానల్ బ్లాక్ కావడానికి గల కారణాన్ని కూడా వివరించాడు.
తన ఛానల్లో పసిపిల్లలకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేసేవాడినని, అందులో కొన్ని వీడియోలు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘించి ‘హానికరమైన కంటెంట్’ (Harmful Content) విభాగం కిందకు రావడంతో ఆదాయం తాత్కాలికంగా నిలిపివేసినట్లు అతను తెలిపాడు. ఆ వీడియోలను సరిదిద్దితేనే మళ్లీ ఆదాయం పొందగలనని కూడా పేర్కొన్నాడు.
ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ముందు ఆ ప్రమాదకరమైన వీడియోలన్నింటినీ డిలీట్ చేయండి, అప్పుడే ఛానల్ మళ్లీ నడుస్తుంది” అని కొందరు సలహా ఇస్తుండగా.. మరికొందరు మాత్రం “అనవసరంగా సోషల్ మీడియాలో ఆదాయాన్ని చూపించి గొప్పలు పోవడం వల్లే ఇలా జరిగింది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply