“దీపావళి పండుగ అని టిప్ అడిగిన డెలివరీ బాయ్. నేనెందుకు ఎక్స్‌ట్రా డబ్బులు ఇవ్వాలి?!” 10 నిమిషాల్లో వాట్సాప్ కాల్ చేసి బెదిరింపు. గందరగోళంలో ఉండిపోయిన మహిళ.!!

ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ (Flipkart Minutes) ద్వారా ఆవనూనె ఆర్డర్ చేసిన ఒక మహిళ వద్దకు డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి, ఆమె అందాన్ని పొగుడుతూ అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, దీపావళి పండుగను సాకుగా చూపి టిప్ అడిగిన ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

ఆ ఉద్యోగి ఆలస్యంగా రావడమే కాకుండా, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి టిప్ అడగడంతో షాకైన ఆమె.. ‘మీకు పనికి తగ్గ జీతం ఇస్తున్నారు కదా, నేను ఎందుకు విడిగా డబ్బులు ఇవ్వాలి?’ అని చెప్పి టిప్ ఇచ్చేందుకు నిరాకరించింది.

కానీ సమస్య అక్కడితో ముగియలేదు. డెలివరీ పూర్తయి వెళ్లిన 10 నిమిషాల్లోనే ఆ డెలివరీ బాయ్ నేరుగా ఆమె వాట్సాప్ నంబర్‌కు కాల్ చేశాడు. దీంతో భయాందోళనకు గురైన ఆ మహిళ తన ఎక్స్ (X) ఖాతాలో.. ‘నేను టిప్ ఇవ్వడానికి నిరాకరించడం తప్పా? డెలివరీ పూర్తయ్యాక అతడు నా వ్యక్తిగత నంబర్‌కు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? అతని నంబర్‌ను బయటపెట్టాలా వద్దా?’ అని నెటిజన్లను ప్రశ్నించింది.

ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ‘దీపావళి పండుగ రోజున పనిచేసే వారికి కాస్త ఉదారంగా టిప్ ఇచ్చి ఉండాల్సింది’ అని అనగా, మెజారిటీ నెటిజన్లు మాత్రం ‘ఇది పూర్తిగా హద్దు మీరిన చర్య, మహిళల భద్రతకు ముప్పు; వెంటనే ఆ ఉద్యోగిపై ఫ్లిప్‌కార్ట్ సంస్థకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేస్తున్నారు.

అదే సమయంలో, డెలివరీ బాయ్స్‌కు కస్టమర్ల డైరెక్ట్ ఫోన్ నంబర్లు ఇవ్వబడవు కాబట్టి, ఇది కేవలం అటెన్షన్ కోసం పెట్టిన ఫేక్ పోస్ట్ అయి ఉండొచ్చని కూడా కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, ఆన్‌లైన్ డెలివరీల సమయంలో మహిళల భద్రత, గోప్యతకు సంబంధించిన చర్చను ఈ ఘటన మరోసారి తెరపైకి తెచ్చింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *