‘ససురాల్ సిమర్ కా’ సీరియల్ ద్వారా ఇంటింటికీ చేరువైన నటి దీపికా కక్కర్ గత కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో పోరాడుతోంది. దీపికాకు లివర్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. క్యాన్సర్‌ను జయించిన తర్వాత ఆమె పొట్టలో సిస్ట్‌లు (గడ్డలు) ఉన్నట్లు గుర్తించారు. దీపికా మరియు ఆమె భర్త, నటుడు షోయబ్ ఇబ్రహీం తమ యూట్యూబ్ వ్లాగ్స్ ద్వారా అభిమానులతో విషయాలను పంచుకుంటూ ఉంటారు.
ఇటీవలి ఒక వ్లాగ్‌లో షోయబ్ మాట్లాడుతూ.. తమ కిచెన్‌లోని ఒక పాన్ మినహా మిగిలిన అన్ని నాన్-స్టిక్ పాత్రలను తీసివేసినట్లు చెప్పాడు. “కేవలం ఆమ్లెట్ వేసుకోవడానికి ఒకటి ఉంచి, మిగిలినవన్నీ పారేశాను” అని తెలిపాడు. అసలు నాన్-స్టిక్ పాత్రలు వాడకూడదని ఎందుకు అంటారు? వాటివల్ల ఆరోగ్యానికి కలిగే నష్టం ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ డి. చంద్రశేఖర్ రెడ్డి దీనిపై స్పందిస్తూ కొన్ని ముఖ్యమైన విషయాలను వివరించారు. ఆధునిక కిచెన్లలో నూనె తక్కువగా వాడటానికి, ఆహారం అంటుకోకుండా ఉండటానికి నాన్-స్టిక్ పాత్రలను ఎక్కువగా వాడుతుంటారు. దీనిపై డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ.. “చాలా వరకు ఆధునిక నాన్-స్టిక్ పాత్రలను సరైన పద్ధతిలో వాడితే రోజువారీ వంటకు సురక్షితమే. వీటిపై ఉండే కోటింగ్ ప్రధానంగా పాలిటెట్రాఫ్లోరోఇథిలిన్ (PTFE) అనే పదార్థంతో తయారవుతుంది. ఇది సాధారణ వంట ఉష్ణోగ్రతల వద్ద సురక్షితంగా ఉంటుంది” అని తెలిపారు.
అయితే, గతంలో నాన్-స్టిక్ పాత్రల తయారీలో PFOA వంటి రసాయనాలను వాడేవారు, ఇవి ఆరోగ్య సమస్యలకు కారణమయ్యేవి. కానీ ఇప్పుడు వస్తున్న ఆధునిక పాత్రలు ‘PFOA-free’ అని ఆయన చెప్పారు. చాలా మంది నాన్-స్టిక్ పాత్రలను ఏళ్ల తరబడి వాడుతుంటారు. వాటిపై గీతలు పడినా లేదా కోటింగ్ ఊడిపోయినా అలాగే వాడుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఆ కోటింగ్ యొక్క సూక్ష్మ కణాలు ఆహారంలో కలిసి శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉందని, అటువంటి పాత్రలను వాడకూడదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
మొత్తానికి, నాన్-స్టిక్ పాత్రలను వాడేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారాన్ని ఏ ఉష్ణోగ్రత వద్ద వండుతున్నాం? పాత్రలను ఎలా శుభ్రం చేస్తున్నాం? అనేది ముఖ్యం. అలాగే, ప్రజలు సమతుల్య ఆహారం, తక్కువ నూనె వాడటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లపై దృష్టి సారించాలని డాక్టర్ రెడ్డి సూచించారు.
