కర్ణాటకలో మరో భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. దెయ్యం పట్టిందనే అనుమానంతో ఒక మహిళను వేప కర్రలతో కొట్టి అత్యంత క్రూరంగా హత్య చేశారు. కలబురగికి చెందిన ఈ మహిళను మహారాష్ట్రలో ఆమె బంధువులే పొట్టనబెట్టుకున్నారు.
ఘటన వివరాలు: హత్యకు గురైన మహిళను కలబురగి జిల్లా ఆలంద్ నివాసి ముక్తాబాయి (38) గా గుర్తించారు. మహారాష్ట్రలోని మురుమ్ గ్రామంలో ఈమె దారుణ హత్యకు గురైంది. ముక్తాబాయికి దెయ్యం పట్టిందని, వేప కర్రలతో కొడితే ఆ దెయ్యం వదిలిపోతుందని నమ్మిన ఆమె భర్త తరపు బంధువులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
అసలేం జరిగింది? కొన్ని రోజుల క్రితం ముక్తాబాయి ఒక్కసారిగా తల తిరిగి కింద పడిపోయింది. అది చూసిన ఆమె బావమరిది మరియు ఇతర బంధువులు ఆమెకు దెయ్యం పట్టిందని భావించారు. దెయ్యం వదిలించే పేరుతో గత నాలుగు రోజుల క్రితం ఆమెపై వేప కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ముక్తాబాయి స్పృహ తప్పి పడిపోవడంతో, బంధువులు ఆమె తల్లికి సమాచారం అందించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి ముక్తాబాయి మరణించింది.
