పాట్నా: బీహార్ రాష్ట్రం జువెలరీ మార్కెట్ భద్రత విషయంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. నగల దుకాణాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు హిజాబ్, నకాబ్, ముసుగు (ఘూంఘట్) లేదా హెల్మెట్ ధరించి దుకాణాల్లోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించిన దేశంలోని మొదటి రాష్ట్రంగా బీహార్ నిలిచింది.
ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్ ఫెడరేషన్ (AIJGF) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోబడింది. ఇది 2026, జనవరి 8 నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానుంది.
ముసుగులకు నో ఎంట్రీ: AIJGF బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ వర్మ ఈ నిర్ణయాన్ని ధృవీకరిస్తూ.. ఇది ఏ మతానికి, సంప్రదాయానికి లేదా వ్యక్తిగత విశ్వాసాలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కేవలం భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే ఈ కఠిన నిబంధనను తెచ్చినట్లు తెలిపారు. ఇకపై బీహార్లోని ఏ నగల దుకాణంలోనైనా ముఖం పూర్తిగా కప్పుకుని వచ్చే కస్టమర్లను లోపలికి అనుమతించరు మరియు వారికి నగలను విక్రయించరు.
నిర్ణయానికి కారణం: ఇటీవలి కాలంలో జరిగిన పలు దోపిడీ ఘటనల్లో నేరగాళ్లు హెల్మెట్లు లేదా ముసుగులు ధరించి 3 నుండి 4 మంది బృందాలుగా వస్తున్నట్లు తేలింది. ముఖం కప్పి ఉండటం వల్ల సీసీటీవీ కెమెరాల్లో వారిని గుర్తించడం సాధ్యం కావట్లేదని, దీనివల్ల పోలీసుల దర్యాప్తుకు ఆటంకం కలుగుతోందని ఫెడరేషన్ పేర్కొంది.
పెరిగిన ధరలే దోపిడీలకు ఆకర్షణ: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర సుమారు ₹1,40,000, కిలో వెండి ధర ₹2,50,000 కు చేరువలో ఉంది. ఇంతటి ఖరీదైన వస్తువులు ఉండటం వల్ల నేరగాళ్లు నగల దుకాణాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ కొత్త నిబంధనకు అందరూ మద్దతు తెలిపారు.
