దేశంలో తొలి డిజిటల్ సెన్సస్: జులై 1 నుంచి మొదటి దశ ప్రారంభం.. అడిగే 34 ప్రశ్నలు ఇవే!

2011 తర్వాత దేశంలో నిలిచిపోయిన జనగణన (సెన్సస్)ను రెండు దశల్లో నిర్వహించడానికి కేంద్రం సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ సెన్సస్ తొలి దశ 2026 జులై 1 నుండి 30 వరకు జరగనుంది.

ఈ దశలో ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికీ వచ్చి 34 ప్రశ్నలు అడుగుతారు. మీరు ఇచ్చే సమాధానాలను వారు స్మార్ట్‌ఫోన్‌లోని యాప్ ద్వారా సేకరిస్తారు. మొదటి దశలో గృహాల జాబితా తయారీ (Houselisting) మరియు గృహ గణన జరుగుతుంది. ఇందులో ఇంటి పరిస్థితి, పైకప్పు రకం, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల లభ్యత, గృహోపకరణాలు, వాహనాలు, మొబైల్ నంబర్ వంటి వివరాలు సేకరిస్తారు. వచ్చే ఏడాది (2027) ఫిబ్రవరిలో జరిగే రెండో దశలో జనాభా గణన చేపడతారు.

ప్రధానంగా అడిగే ప్రశ్నలు ఇవే:

  • భవనం నంబర్ (మున్సిపల్ లేదా స్థానిక సంస్థ ఇచ్చిన నంబర్).
  • నేల తయారీకి వాడిన పదార్థం.
  • గోడల నిర్మాణం (సిమెంటు, ఇటుక మొదలైనవి).
  • పైకప్పు రకం.
  • నివసిస్తున్న ఇంటి వినియోగం (నివాసమా? వ్యాపారమా?).
  • ఇంటి పరిస్థితి.
  • ఇంటి నంబర్.
  • ఇంట్లో నివసిస్తున్న మొత్తం వ్యక్తుల సంఖ్య.
  • ఇంటి యజమాని (కుటుంబ పెద్ద) పేరు.
  • యజమాని లింగం (పురుషుడు/స్త్రీ/ట్రాన్స్‌జెండర్).
  • యజమాని సామాజిక వర్గం (SC/ST/ఇతరులు).
  • ఇంటి యాజమాన్య స్థితి (సొంత ఇల్లా? అద్దె ఇల్లా?).
  • యజమాని వద్ద ఉన్న గదుల సంఖ్య.
  • ఇంట్లో నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య.
  • ప్రధాన తాగునీటి వనరు.
  • తాగునీటి లభ్యత (ఇంట్లోనా? బయటా?).
  • ప్రధాన వెలుతురు వనరు (విద్యుత్ మొదలైనవి).
  • మరుగుదొడ్డి సౌకర్యం ఉందా?
  • మరుగుదొడ్డి రకం.
  • మురుగునీటి పారుదల సౌకర్యం.
  • స్నానాల గది సౌకర్యం.
  • వంటగది మరియు LPG/PNG కనెక్షన్ ఉందా?
  • వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం.
  • రేడియో/ట్రాన్సిస్టర్ ఉందా?
  • టెలివిజన్ ఉందా?
  • ఇంటర్నెట్ సదుపాయం ఉందా?
  • ల్యాప్‌టాప్/కంప్యూటర్ ఉందా?
  • టెలిఫోన్/మొబైల్ ఫోన్/స్మార్ట్‌ఫోన్ ఉందా?
  • సైకిల్/స్కూటర్/మోటార్ సైకిల్ ఉందా?
  • కారు/జీపు/వ్యాన్ ఉందా?
  • ఇంట్లో ఉపయోగించే ప్రధాన తృణధాన్యాలు.
  • మొబైల్ నంబర్ (సెన్సస్ కమ్యూనికేషన్ కోసం మాత్రమే).

కీలక తేదీలు: గృహాల జాబితా తయారీ జులై 1 నుండి 30 వరకు జరుగుతుంది. అయితే, 2026 జూన్ 16 నుండి 30 వరకు ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ (స్వయంగా వివరాలు నమోదు చేసుకోవడం)కు అవకాశం ఉంటుంది. వెబ్ పోర్టల్ ద్వారా కుటుంబాలే స్వయంగా వివరాలు ఇవ్వవచ్చు. ఆ తర్వాత అధికారులు ఇంటికి వచ్చి వాటిని ధృవీకరిస్తారు. దీని కోసం ‘Census-2027 HLO’ అనే మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.

రెండో దశ అయిన అసలైన జనాభా గణన 2027 ఫిబ్రవరిలో జరుగుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా సెన్సస్ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లా అధికారులు, ఛార్జ్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తున్నారు. డిజిటల్ పద్ధతిలో నిర్వహించడం వల్ల అధికారుల పనిభారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసిన వారు, తమకు లభించిన అక్నాలెడ్జ్‌మెంట్‌ను ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు చూపిస్తే సరిపోతుంది.


Posted

in

by

Tags: