భారతదేశంలో దీపావళి అంటేనే ప్రతి ఇంటా దీపాలు వెలిగించి, టపాసులు పేల్చి ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం ఆనవాయితీ. కానీ, దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకోవడానికి ముందే ఓ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, ధమ్తరి జిల్లాలోని సెమ్రా-సి (Semra-C) అనే గ్రామంలో ఈ విభిన్నమైన సంప్రదాయం కొనసాగుతోంది. జిల్లా కేంద్రానికి సుమారు 22 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామంలో నవంబర్ 3నే దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ప్రతి ఇంటా దీపాలు వెలిగించి, లక్ష్మీదేవికి, వినాయకుడికి పూజలు చేసి, టపాసులు పేల్చి ప్రజలు ఎంతో సంతోషంగా పండుగను జరుపుకున్నారు.
ఈ గ్రామం ప్రత్యేకత కేవలం దీపావళితోనే ఆగిపోలేదు. హోలీ, హరేలీ, పోలా తదితర ముఖ్యమైన పండుగలను కూడా ఇక్కడి ప్రజలు సాధారణ తేదీ కంటే వారం ముందే జరుపుకుంటారు. దీని వెనుక ఎన్నో తరాలుగా వస్తున్న ఒక సంప్రదాయం, విశ్వాసం ఉన్నట్లు చెబుతారు. కొన్ని శతాబ్దాల క్రితం ఈ గ్రామం దట్టమైన అడవులతో చుట్టుముట్టబడి ఉండేది. ఆ సమయంలో వన్యప్రాణుల ముప్పు కూడా ఎక్కువగా ఉండేదని అంటారు.
ఆ కాలంలో ‘సిర్దార్’ అనే వ్యక్తి అడవి జంతువుల బారి నుంచి గ్రామస్థులను రక్షించేందుకు పోరాడి తన ప్రాణాలను అర్పించాడని స్థానికుల నమ్మకం. ఆ తర్వాత గ్రామ పూజారి కలలో సిర్దార్ దేవ్ కనిపించి, గ్రామం సుభిక్షంగా ఉండాలంటే ముఖ్యమైన పండుగలను వారం రోజుల ముందే జరుపుకోవాలని ఆదేశించాడట. అప్పటి నుంచి గ్రామస్తులు ఈ ఆనవాయితీని పాటిస్తూ వస్తున్నారు. కాలం మారినా పూర్వీకులు పాటించిన ఈ నమ్మకాన్ని, సంప్రదాయాన్ని వాళ్లు నేటికీ వదులుకోలేదు.
ప్రస్తుతం సెమ్రా-సి గ్రామంలో జరిగే దీపావళి వేడుకలు, చుట్టుపక్కల 15 నుంచి 20 గ్రామాల ప్రజలు పాల్గొనేంత పెద్ద ఉత్సవంగా మారాయి. రాజ్‌నంద్‌గావ్ లాంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చి దీపావళి జరుపుకుంటారు. ఒక్కోసారి పండుగ సమయంలో వచ్చే అతిథుల సంఖ్య ఆ గ్రామ జనాభా కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు. ఒక ఊరి నమ్మకం, కాలక్రమంలో అనేక గ్రామాలను ఏకం చేసే పండుగగా మారడం పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.

Leave a Reply