పుణె: నుదుటిపై తిలకం, చేతిలో జపమాల, నోట ఆధ్యాత్మిక మాటలు.. ఇవన్నీ చూసి ఆయన్ను ఒక అవతార పురుషుడని నమ్మారు ఆ భక్తులు. తమ ఆస్తులు, రహస్యాలన్నీ ఆయన ముందు కుమ్మరించారు. కానీ, ఆ ఆధ్యాత్మిక ముసుగు వెనుక ఉన్నది పరమ కిరాతకమైన క్రిమినల్ బుద్ధి అని తెలిశాక ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు.
షిర్డీకి చెందిన ఆధ్యాత్మిక గురువుగా చలామణి అవుతున్న అశోక్ ఖరత్ చేస్తున్న ఘరానా మోసాలు ఇప్పుడు మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. భక్తుల కష్టాలు తీర్చాల్సిన గురువే, వారిని నిలువునా ముంచేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఎవరీ అశోక్ ఖరత్?
షిర్డీ ప్రాంతంలో ఉన్న బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలే ఈయన టార్గెట్. మీ జాతకంలో దోషాలు ఉన్నాయని, ప్రత్యేక పూజలు చేస్తే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుందని నమ్మించి వారిని బుట్టలో వేసుకుంటాడు. ఒకసారి వారి నమ్మకాన్ని గెలుచుకున్నాక, వారి ఇంట్లో డబ్బు ఎక్కడ ఉంది? లెక్కల్లో చూపని ఆస్తులు ఎంత? అనే పూర్తి సమాచారాన్ని ఆధ్యాత్మిక చర్చల పేరుతో సేకరిస్తాడు.
‘స్పెషల్ 26’ తరహాలో స్కెచ్!
వ్యాపారుల రహస్యాలన్నీ తెలిశాక అశోక్ ఖరత్ అసలు ఆట మొదలవుతుంది. అక్షయ్ కుమార్ నటించిన ‘స్పెషల్ 26’ సినిమా తరహాలో తన అనుచరులకు ఇన్కమ్ టాక్స్ (IT) అధికారుల వేషాలు వేయించి భక్తుల ఇళ్ల మీదకు పంపిస్తాడు. ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా వచ్చే ఈ నకిలీ అధికారులను చూసి వ్యాపారులు హడలిపోతారు. ఇంట్లోని కీలక పత్రాలను, నగదును సీజ్ చేస్తున్నట్లు నటిస్తూ బెదిరింపులకు దిగుతారు.
సంకట హరకుడిలా ఎంట్రీ!
ఇంట్లో ఐటీ దాడులు జరుగుతుండగానే, బెంబేలెత్తిపోయిన భక్తులు తమ ‘పరమ పూజ్య’ అశోక్ ఖరత్ గురూజీకి ఫోన్ చేస్తారు. అప్పుడు మన గురూజీ ఒక హీరోలా రంగంలోకి దిగి.. “మీరేం భయపడకండి, నాకు పైస్థాయిలో పెద్ద పెద్ద అధికారులతో పరిచయాలు ఉన్నాయి. ఈ మ్యాటర్‌ను అక్కడికక్కడే క్లోజ్ చేద్దాం.. కానీ కొంచెం ఖర్చవుతుంది” అంటూ నమ్మిస్తాడు.
తమ పరువు కాపాడుకోవడానికి వ్యాపారులు కోట్లకు కోట్లు ఖరత్ చేతిలో పెడతారు. అటు ఐటీ దాడులు కూడా నిలిచిపోతాయి. తన మనుషులనే పంపి దాడులు చేయించడం, తానే మధ్యవర్తిగా వచ్చి డబ్బు వసూలు చేయడం.. ఇది ఆయన పక్కా ప్రొఫెషనల్ క్రిమినల్ ప్లాన్.
బాధితులు ఎందుకు మౌనంగా ఉన్నారు?
వేల కోట్ల రూపాయలు దోచుకున్నా బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం ‘నల్లధనం’. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలైన ఐటీ అధికారులు వచ్చి తమ ఆస్తుల లెక్కలు అడుగుతారనే భయం ఒకవైపు, సమాజంలో పరువు పోతుందనే భయం మరోవైపు వారిని నోరు మెదపనివ్వడం లేదు.
అధికారుల నిఘా..
ప్రస్తుతం ఈ వ్యవహారం దావానంలా వ్యాపించడంతో జిల్లా యంత్రాంగం, పోలీసులు ఈ కుంభకోణం మూలాలను వెతకడం ప్రారంభించారు. విచారణ ముమ్మరం చేస్తే మహారాష్ట్రలోని ఇంకెంత మంది బడా బాబుల పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి.
