వాషింగ్టన్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు గత శనివారం అరెస్టు చేసి అమెరికాకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, ఆయన్ను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య న్యూయార్క్ కోర్టుకు తీసుకువచ్చారు.
కోర్టు ప్రాంగణంలో మదురో తడబడుతూ నడుస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయనపై నమోదైన కేసుల విచారణ నేడు న్యూయార్క్ కోర్టులో ప్రారంభం కానుంది. సుమారు 15 ఏళ్ల పాటు వెనిజులాను పాలించిన మదురో, ఇప్పుడు అమెరికా దళాల అదుపులో ఉన్నారు. ఆయనపై ఉన్న కేసుల విచారణ అమెరికాలోనే జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
న్యూయార్క్ కోర్టులో హాజరు
మదురోను కొద్దిసేపటి క్రితమే న్యూయార్క్ కోర్టుకు తీసుకువచ్చారు. అమెరికా కోర్టులో ఆయన హాజరుపరచబడటం ఇదే మొదటిసారి. ట్రంప్ ప్రభుత్వం ఆయనపై ప్రధానంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా (Drug Trafficking) ఆరోపణలు మోపింది.
నడవలేని స్థితిలో మదురో
ఖైదీలకు ఇచ్చే ఖాకీ దుస్తుల్లో, చేతులకు బేడీలతో మదురో కోర్టుకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలలో ఆయన సరిగ్గా నడవలేకపోతున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరు అమెరికా సైనికులు ఆయన్ను పట్టుకుని నడిపించుకుంటూ తీసుకెళ్లారు. మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరస్ను కూడా కోర్టులో హాజరుపరిచారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:15 గంటలకు భారీ కాన్వాయ్ మరియు హెలికాప్టర్ల భద్రత మధ్య బ్రూక్లిన్ జైలు నుండి మన్హாட்டన్ కోర్టుకు వీరిని తరలించారు.
ప్రధాన ఆరోపణలు
మదురోపై 25 పేజీల అభియోగ పత్రం (Charge Sheet) దాఖలైంది. అందులోని ప్రధానాంశాలు:
- డ్రగ్స్ రవాణా: వేల టన్నుల మాదకద్రవ్యాలను అమెరికాకు పంపడానికి మదురో మరియు ఆయన భార్య వివిధ ముఠాలతో ఒప్పందాలు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
- హింస మరియు హత్యలు: తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిని లేదా డబ్బు చెల్లించని వారిని కిడ్నాప్ చేయడం, దాడులు చేయడం మరియు హత్య చేయాలని మదురో ఆదేశించినట్లు పేర్కొన్నారు.
- భార్యపై ఆరోపణలు: మదురో భార్య సిలియా ఫ్లోరస్, డ్రగ్స్ ముఠా నాయకులకు మరియు అధికారులకు మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి లక్షలాది డాలర్ల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కోర్టులో ఏం జరగవచ్చు?
మదురో తరపు న్యాయవాదులు ఈ అరెస్టును ‘చట్టవిరుద్ధం’ అని వాదించనున్నారు. ఒక స్వతంత్ర దేశాధినేతను అమెరికా ఇలా అరెస్టు చేయలేదని వారు వాదించవచ్చు. అయితే, 2024 వెనిజులా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని భావిస్తున్న అమెరికా, మదురోను వెనిజులా చట్టబద్ధమైన నాయకుడిగా గుర్తించడం లేదు. అందువల్ల మదురో తరపు వాదనలు కోర్టులో చెల్లుబాటు కావడం కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
