నడవాలంటే ఇద్దరి సహాయం కావాలి.. కానీ 34 ఏళ్ల క్రితం చేసిన నేరం వదలలేదు: బీహార్‌లో 84 ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష!

బీహార్‌లోని వైశాలి జిల్లా నుండి వెలుగుచూసిన ఈ ఘటన, “చట్టం తన పని తాను చేసుకుపోతుంది” అనే మాటకు అక్షరాలా నిదర్శనంగా నిలిచింది. సాధారణంగా 84 ఏళ్ల వయసులో మనుషులు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూనో, దైవచింతనతోనో కాలం గడుపుతుంటారు. కానీ, ఒక వృద్ధుడు 34 ఏళ్ల క్రితం చేసిన నేరానికి ఇప్పుడు జైలు పాలయ్యాడు.

ఏమిటీ కేసు? ఈ ఘటన 1992లో బీహార్‌లోని వైశాలి జిల్లా, జుడావన్ పూర్ ప్రాంతంలో జరిగింది. ‘అదాలత్ రాయ్’ అనే వ్యక్తి తన భార్య రాంశకీ దేవితో కలిసి ఇంటి బయట కూర్చుని ఉండగా, ‘దీప్ రాయ్’ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి కర్రలు, ఆయుధాలతో అక్కడికి వచ్చాడు. వారు అదాలత్ రాయ్ వెళ్లే దారిలో గాజు ముక్కలు పారబోస్తుండగా, ఆయన దాన్ని వ్యతిరేకించారు. దీంతో దీప్ రాయ్ మరియు అతని కుటుంబ సభ్యులు వారిపై ప్రాణాంతక దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

నలుగురు మరణించారు, మిగిలింది దీప్ రాయ్ ఒక్కడే: కేసు నమోదైనప్పటి నుండి తీర్పు వెలువడే వరకు 34 ఏళ్లు గడిచిపోయాయి. ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో, నిందితులుగా ఉన్న ఐదుగురిలో నలుగురు ఇప్పటికే మరణించారు. ప్రస్తుతం దీప్ రాయ్ మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు. అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి మనోజ్ కుమార్ తివారీ కోర్టు, కేసును పూర్తిగా విచారించిన అనంతరం, దీప్ రాయ్‌ని ఐపీసీ సెక్షన్లు 147, 148, 307 (హత్యాయత్నం) మరియు 134 ఆర్మ్స్ యాక్ట్ కింద దోషిగా తేల్చింది.

వృద్ధాప్యంలో శిక్ష: కోర్టు ప్రాంగణం నుండి బయటకు వస్తున్న 84 ఏళ్ల దీప్ రాయ్ పరిస్థితి చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన సొంతంగా నడవలేని స్థితిలో ఉన్నారు, లేవడానికి కూడా ఇద్దరి సహాయం కావాల్సి వస్తోంది. వృద్ధాప్యం వల్ల ఆయన శరీరం సహకరించడం లేదు. అయినప్పటికీ, చట్టం అతనికి ఎటువంటి ఉపశమనం ఇవ్వకుండా శిక్షను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Posted

in

by

Tags: