కన్యాకుమారి: నాగర్‌కోవిల్ – చెన్నై మధ్య నడిచే వందే భారత్ రైలు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు నాగర్‌కోవిల్‌లో బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఆ సమయంలో రైల్వే స్టేషన్ మానేజర్ మార్గమధ్యలో ఉన్న గేట్ కీపర్లందరికీ ఫోన్ చేసి అలర్ట్ చేశారు. కానీ, నాంగునేరి రైల్వే గేట్ కీపర్ మాత్రం ఫోన్ ఎత్తలేదు. తీరా చూస్తే అక్కడి గేట్ కీపర్లు మద్యం మత్తులో స్పృహ తప్పి పడి ఉండటంతో వందే భారత్ రైలు నిలిచిపోయింది. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు.
అసలేం జరిగింది? సాధారణంగా తాంబరం నుండి చెంగల్పట్టు వరకు ఉండే మార్గంలో వందలాది రైళ్లు తిరుగుతుంటాయి. అక్కడ మరైమలై నగర్, పొత్తేరి వంటి గేట్లు చాలా ప్రమాదకరమైనవి. గేట్ కీపర్లు ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ రైళ్ల రాకపోకలను నియంత్రిస్తుంటారు. కానీ, నాగర్‌కోవిల్ సమీపంలోని నాంగునేరి వద్ద మాత్రం గేట్ కీపర్లు మద్యం మత్తులో జోగడం వల్ల ఏకంగా వందే భారత్ రైలే ఆగిపోవాల్సి వచ్చింది.
ఫోన్ ఎత్తని గేట్ కీపర్లు: మార్చి 21, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు వందే భారత్ రైలు బయలుదేరే ముందు స్టేషన్ మానేజర్ నాంగునేరి గేట్ కీపర్‌కు ఫోన్ చేశారు. ఎంతకీ స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి మరో ఉద్యోగిని అక్కడికి పంపారు. ఆ ఉద్యోగి వెళ్లి చూడగా.. అక్కడి గదిలో ఇద్దరు గేట్ కీపర్లు మద్యం మత్తులో అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
రైలు నిలిపివేత: అప్పటికే రైలు వల్లియూర్ స్టేషన్ చేరుకుంది. నాంగునేరి గేట్ వేయకపోవడంతో సిగ్నల్ అందక రైలును అక్కడే నిలిపివేశారు. ఆ తర్వాత ప్రత్యామ్నాయ ఉద్యోగి ద్వారా గేటు వేయించి, సిగ్నల్ క్లియర్ అయ్యాక రైలు మళ్ళీ బయలుదేరింది. ఈ గందరగోళం వల్ల రైలు 10 నిమిషాలు ఆలస్యంగా నడిచింది.
ఉద్యోగాల కోత తప్పదా? రైల్వే పోలీసులు మద్యం మత్తులో ఉన్న కొంబయ్య, శ్రావణ్ అనే ఇద్దరు ఉద్యోగులను ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించగా.. వారు మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. దీనిని తీవ్రంగా పరిగణించిన నాగర్‌కోవిల్ రైల్వే ఇంజనీరింగ్ విభాగం అధికారి వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైల్వే నిబంధనల ప్రకారం భద్రతకు బాధ్యత వహించే ఉద్యోగులు డ్యూటీలో మద్యం సేవిస్తే వారికి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తారు. వందే భారత్ వంటి వేగవంతమైన రైళ్లు నడిచే మార్గంలో ఇలాంటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది కాబట్టి, వారిని శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించే (Dismissal) అవకాశం కూడా ఉంది.
