మధ్యప్రదేశ్‌లోని రేవా నగరంలో ఆటో ఛార్జీ విషయంలో తలెత్తిన చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ మహిళ ఆటో డ్రైవర్‌పై చెప్పుతో దాడి చేయడం కలకలం రేపింది.
రేవా నగరంలోని రద్దీగా ఉండే ఆసుపత్రి కూడలి ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆటో ఛార్జీ విషయంలో మహిళకు, డ్రైవర్‌కు మధ్య మొదట మాటల యుద్ధం మొదలైంది. చూస్తుండగానే ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది.
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ తన కాలికి ఉన్న చెప్పును తీసి ఆటో డ్రైవర్‌పై వరుసగా దాడి చేసింది. ఆటో డ్రైవర్ కూడా ఆమెపై తిరిగి ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
నడిరోడ్డుపై ఒక్కసారిగా జరిగిన ఈ గొడవను చూసి అటుగా వెళ్తున్న ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. అయితే గొడవను ఆపేందుకు ప్రయత్నించకుండా చాలామంది చూస్తూ నిలబడిపోయారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను తన మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
కాగా, రేవా ప్రాంతంలో ఆటో ఛార్జీల విషయంలో ప్రయాణికులు, డ్రైవర్ల మధ్య గొడవలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గత గురువారం కూడా కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఆటో ఛార్జీ విషయంలో డ్రైవర్, ప్రయాణికుడి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, చివరకు ఘర్షణకు దారితీసింది.
వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండటంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోయి బహిరంగంగా దాడులకు దిగడం చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply