బెంగళూరు: బెంగళూరు – మైసూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఒక కారులో వెళ్తున్న కుటుంబ సభ్యులను దుండగుల ముఠా నడిరోడ్డుపై అడ్డగించి, దారుణంగా దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ ఘటన మద్దూర్ హైవే ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. బాధిత కారు వెనుక వస్తున్న మరో వాహనంలోని ‘డాష్‌క్యామ్’ (Dashcam)లో ఈ దారుణ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి.
ఎక్స్‌ప్రెస్‌వే మధ్యలో నిలిపి ఉంచిన ఒక నీలం రంగు కారు వైపు పరుగెత్తుకుంటూ వచ్చిన ఒక ముఠా, కారు డోర్లను బలవంతంగా తీసి డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తిపై దాడి చేసింది. ఇతర వాహనదారులు చూస్తుండగానే, ఆ గుంపులోని ఒక వ్యక్తి ఇనుప వస్తువుతో డ్రైవర్‌ను విచక్షణారహితంగా కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
దాడికి గురైన కారులో ఒక మహిళ మరియు చిన్నారి సహా సుమారు 4 నుండి 5 మంది ఉన్నారు. దాడి తీవ్రరూపం దాల్చడంతో, అటుగా వెళ్తున్న ఇతర వాహనదారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. వీడియో చివరలో, కారులో ఉన్న మహిళ కిందకు దిగి, దాడులు ఆపమని చేతులు జోడించి వేడుకోవడం కనిపిస్తుంది. అయినప్పటికీ ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ముఠా, డ్రైవర్‌ను రోడ్డుపైకి ఈడ్చి మరి దాడి చేసింది.
ఈ ఘర్షణకు గల అసలు కారణం ఏంటో ఇప్పటి వరకు తెలియలేదు. ఈ ఘటనకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించడంపై గానీ, లేదా వారి అరెస్టుపై గానీ స్థానిక పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.
