గుజరాత్లోని అమ్రేలి జిల్లాలో రాత్రి వేళ జాతీయ రహదారిపైనే సింహాల కుటుంబం తిష్ట వేసిన ఘటన వాహనదారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
సావర్కుండ్లా-రాజులా రాష్ట్ర రహదారిపై అంబర్డి గ్రామం సమీపంలో ఓ ఆడ సింహం తన రెండు పిల్లలతో కలిసి వచ్చింది. ఆ సమయంలో రోడ్డు పక్కన ఉన్న ఓ పశువును వేటాడి, అక్కడికే లాక్కొచ్చి తినడం ప్రారంభించింది. వేట ముగిసిన తర్వాత కూడా ఆ ఆడ సింహం, దాని పిల్లలు రోడ్డు పక్కనే కూర్చొని ఉండటంతో ఆ మార్గంలో వస్తున్న వాహనాలు వరుసగా ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
రాత్రి పూట రోడ్డుపై అకస్మాత్తుగా సింహాల కుటుంబం కనిపించడంతో వాహనదారులు తమ కార్లను, వాహనాలను దూరంగానే నిలిపివేశారు. భయంతో ఎవరూ బయటకు రాకుండా వాహనాల్లోనే వేచి ఉన్నారు. కొందరు తమ సెల్ఫోన్లలో ఈ దృశ్యాలను వీడియో తీశారు. దీంతో హైవేపై ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనాలు బారులు తీరాయి.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సింహాల కుటుంబానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షించారు. రోడ్డుపై పడి ఉన్న పశువు అవశేషాలను అటవీ సిబ్బంది అక్కడి నుంచి తొలగించడంతో, సింహం దాని పిల్లలతో కలిసి రోడ్డును వదిలి అడవి వైపు వెళ్లిపోయింది. అనంతరం రహదారిపై రాకపోకలను పునరుద్ధరించారు.
సింహాల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ సిబ్బంది రాత్రంతా ఆ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేశారు. సింహాల సంచారం ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయని, వన్యప్రాణులు కనిపించినప్పుడు వాహనదారులు వాటి దగ్గరికి వెళ్లకుండా సురక్షితమైన దూరంలో ఉండాలని అధికారులు హెచ్చరించారు. హైవేపైనే సింహం వేటాడి, పిల్లలతో కలిసి రోడ్డుపై కూర్చున్న ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
