ఒడిశాలోని భద్రక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వరదలో చిక్కుకున్న 60 ఏళ్ల వృద్ధురాలిని ఓ ఆశా కార్యకర్త తన వీపుపై మోస్తూ సురక్షిత ప్రాంతానికి చేర్చిన ఘటన తీవ్ర భావోద్వేగాన్ని నింపింది.
ధామ్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగావ్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో, నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలు సహాయం కోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది.
నందిగావ్, భరత్‌పూర్ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్న ‘మినాటి సాహు’ అనే ఆశా కార్యకర్త, వరద పరిస్థితిని తెలుసుకుని గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో ఇంటి గుమ్మం వద్ద ఒంటరిగా చిక్కుకుపోయిన 60 ఏళ్ల బసంత దాస్‌ను ఆమె గమనించారు. కాలి సమస్య కారణంగా ఆమె సొంతంగా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అంతేకాకుండా, ఆమె కుమారుడు తన గర్భిణి భార్య వైద్య సహాయం కోసం బయటకు వెళ్లినట్లు సమాచారం.
వరద నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో, వృద్ధురాలిని వెంటనే అక్కడి నుంచి తరలించాలని మినాటి సాహు నిర్ణయించుకున్నారు. ఎలాంటి రవాణా సదుపాయం లేకపోవడంతో, ఆ వృద్ధురాలిని తన వీపుపై ఎక్కించుకుని సుమారు అర కిలోమీటరు దూరం వరద నీటిలోనే నడిచారు. నడుము లోతు నీరు, వేగంగా ప్రవహిస్తున్న ప్రవాహాన్ని లెక్కచేయకుండా సమీపంలోని పటానా కమ్యూనిటీ సెంటర్‌కు ఆమెను సురక్షితంగా చేర్చారు. ఆ సమయంలో ఆ కేంద్రాన్ని తాత్కాలిక వరద సహాయక శిబిరంగా ఉపయోగిస్తున్నారు.
మినాటి సాహు చూపిన ఈ అసాధారణ ధైర్యసాహసాలను అధికారులు, ప్రజలు ప్రశంసిస్తున్నారు. విపత్తుల సమయంలో క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తల పాత్ర ఎంతటి కీలకమైనదో ఈ ఘటన రుజువు చేసిందని భద్రక్ జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి మధుస్మిత శతపతి కొనియాడారు. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో వరద ప్రభావం కొనసాగుతుండగా, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Leave a Reply