పుణేకు చెందిన 46 ఏళ్ల వ్యాపారి ఒకరు, తన కుటుంబ సభ్యులకు బిజినెస్ పనిమీద మలేషియా వెళ్తున్నానని అబద్ధం చెప్పి, తన ప్రియురాలితో కలిసి మలేషియా వెళ్లేందుకు ప్రణాళిక వేశాడు. దీని కోసం ఇద్దరూ ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు.
విమానాశ్రయంలో అధికారుల ఇమ్మిగ్రేషన్ తనిఖీ సమయంలో, ఆ వ్యాపారి ప్రియురాలు తెచ్చింది పాత పాస్‌పోర్ట్ అని తేలింది. పాస్‌పోర్ట్ పోయిందని ఆమె చెప్పినప్పటికీ, పాత పత్రంతో ప్రయాణించడం కుదరదని స్పష్టం చేసిన అధికారులు, ఆమెను అరెస్టు చేసే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.
దీంతో భయపడిన ఆ వ్యాపారి తన మలేషియా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. అయితే, ఈ విషయం తన భార్యకు తెలిస్తే పెద్ద గొడవవుతుందని భయపడి, వెంటనే తన సెల్‌ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. అనంతరం విమానాశ్రయంలోని ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి భార్యకు కాల్ చేసి, పాస్‌పోర్ట్ సమస్య వల్ల తన ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని అబద్ధం చెప్పాడు.
ఆ తర్వాత ఆ వ్యాపారి తన ప్రియురాలితో కలిసి ముంబై రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. మరుసటి రోజు తన భార్యకు కొన్ని సెకన్ల పాటు వీడియో కాల్ చేసి మాట్లాడి, మళ్లీ ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. భర్తను కాంటాక్ట్ చేయలేక కంగారుపడిన భార్య, తన భర్తను ఎవరో కిడ్నాప్ చేశారని భావించి వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ఆ వ్యాపారి, వేరే దారి లేక స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి హాజరయ్యాడు. పోలీసులు జరిపిన తీవ్ర విచారణలో, ప్రియురాలితో కలిసి విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేశానని, ఆ విషయాన్ని భార్య నుంచి దాచడానికే కిడ్నాప్ నాటకం ఆడేశానని అతను ఒప్పుకున్నాడు.

Leave a Reply