ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజియాబాద్, విజయ్‌నగర్ ప్రాంతంలోని ‘గౌర్ సిద్ధార్థం’ అపార్ట్మెంట్లో నివసిస్తున్న 16 ఏళ్ల విద్యార్థిని, మంగళవారం సాయంత్రం 15వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.
ఒక ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని కింద పడిన శబ్దం విని పరుగెత్తుకొచ్చిన సెక్యూరిటీ సిబ్బంది, పొరుగువారు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులు, బంధువులు కూతురి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ సమయంలో అక్కడ గుమిగూడిన కొందరు ఈ ఘటనను సెల్ఫోన్లలో వీడియో తీయడానికి ప్రయత్నించడంతో, ఆగ్రహించిన తల్లిదండ్రులకు, వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం సమాచారం అందుకున్న విజయ్‌నగర్ పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు జరిపిన ప్రాథమిక తనిఖీల్లో విద్యార్థిని రాసిన రెండు పేజీల ఆత్మహత్య లేఖ లభించింది. అందులో, “నాపై ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరూ ఇకపై బాధపడకుండా సంతోషంగా జీవించాలి; నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు” అని పేర్కొంది. అంతేకాకుండా, తన చెల్లెలు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, తన కోసం తల్లిదండ్రులు తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని భావోద్వేగంగా రాసింది.
ముఖ్యంగా, చదువులో విపరీతమైన ఒత్తిడి, భారాన్ని తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ విద్యార్థిని తన లేఖలో తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన కొత్వాలి అసిస్టెంట్ కమిషనర్ (ACP) ఉపాసనా పాండే, సూసైడ్ నోట్‌ను చేతివ్రాత విశ్లేషణ కోసం పంపామని, తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ ఘటన విద్యార్థుల్లో పెరుగుతున్న చదువుల ఒత్తిడిపై మళ్లీ తీవ్ర ఆందోళనను రేకెత్తించింది.

Leave a Reply