“నన్ను ట్రాన్స్‌జెండర్‌లా ఉన్నావంటున్నారు.. ఒజెంపిక్ ఇంజెక్షన్లు వాడానంట!”.. ఖుష్బూ కుమార్తె అనందిత ఇచ్చిన కౌంటర్!

చెన్నై: ఒకప్పుడు సోషల్ మీడియాలో “ఖుష్బూ కుమార్తె చాలా లావుగా ఉందేంటి” అని తీవ్ర బాడీ షేమింగ్‌కు గురైన అనందిత సుందర్, ఇప్పుడు “ఇంత సన్నగా ఎలా అయ్యింది?” అనే సరికొత్త వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

శరీర బరువును తగ్గించుకున్నందుకు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో.. ఖుష్బూ చిన్న కుమార్తె అనందిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి వీటన్నింటికీ ఘాటుగా సమాధానమిచ్చింది.

తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా రాణిస్తున్న ఖుష్బూ కుటుంబం ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆమె కుమార్తెలు అవంతిక, అనందిత చిన్నప్పటి నుంచే సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. ఒకానొక దశలో వీరిద్దరూ అధిక బరువు కారణంగా తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. “ఖుష్బూ కూతుళ్లు వాళ్ల అమ్మలాగే చాలా లావుగా ఉన్నారు” అంటూ కామెంట్లు వచ్చేవి. అయితే ఆ విమర్శలన్నింటికీ సమాధానంగా వారిద్దరూ తమ లైఫ్‌స్టైల్‌ను మార్చుకుని, కఠిన శ్రమతో బరువును భారీగా తగ్గించుకున్నారు. కానీ, అదే ఇప్పుడు వారికి సరికొత్త తలనొప్పిగా మారింది.

ఖుష్బూ కుమార్తె సంచలన ఇంటర్వ్యూ..
ఇటీవలే విడుదలై విజయవంతంగా నడుస్తున్న “డబుల్ ఆక్యుపెన్సీ” సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొన్న అనందితను చూసి అభిమానులు, నెటిజన్లు అవాక్కయ్యారు. ఒకప్పుడు బొద్దుగా ఉన్న అనందిత ఇప్పుడు స్లిమ్‌గా, చాలా సన్నగా మారిపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షురూ అయ్యాయి.

హాలీవుడ్ డ్రగ్ ‘ఒజెంపిక్’ వాడారంటూ విమర్శలు..
“ఖుష్బూ ఫ్యామిలీ మొత్తం బరువు తగ్గడానికి ‘ఒజెంపిక్’ (Ozempic – బరువు తగ్గడానికి వాడే ఇంజెక్షన్) ఉపయోగించారు. అమ్మ, ఇద్దరు కూతుళ్లు ఒకేలా సన్నబడ్డారు అంటే ఇది ఖచ్చితంగా మందులు లేదా సర్జరీల మహిమే. వీళ్లంతా ఒజెంపిక్ బ్రాండ్ అంబాసిడర్లలా తయారయ్యారు” అంటూ నెటిజన్లు ఘోరంగా కిండల్ చేయడం ప్రారంభించారు.

ఏడేళ్ల సుదీర్ఘ పోరాటం..
ఈ విమర్శలపై అనందిత స్పందిస్తూ.. తాను ఒకే రాత్రిలో మాయాజాలంతో సన్నబడలేదని స్పష్టం చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నేను, మా అక్క ఒకానొక దశలో విపరీతమైన అధిక బరువుతో ఉన్నాం. దానివల్ల మాకు 16 ఏళ్ల వయసులోనే ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఆరోగ్యంగా జీవించాలనే ఉద్దేశంతోనే బరువు తగ్గాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.”

“మా వెయిట్ లాస్ జర్నీ 2018 లేదా 2019 కాలంలోనే ప్రారంభమైంది. గత 7 ఏళ్లుగా నిరంతరం కష్టపడి, డైట్, వర్కౌట్లు చేయడం వల్లే ఈరోజు నేను ఈ స్థితికి వచ్చాను. ఇది ఒక రాత్రిలో జరిగిన మార్పు కాదు” అని ఆమె తేల్చి చెప్పింది.

కరోనా కాలంలో మారిన రూపం..
అనందిత చెప్పిన మరో విషయం ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. “కరోనా లాక్‌డౌన్ సమయంలో మేము బయటకు ఎక్కువగా రాలేదు. ఆ మూడు సంవత్సరాల కాలంలో మా శరీరంలో ఎంత మార్పు వచ్చిందో ప్రజలు చూడలేదు. అందుకే చాలా కాలం తర్వాత మమ్మల్ని హఠాత్తుగా చూసేసరికి.. సర్జరీలు చేయించుకున్నారు, ఇంజెక్షన్లు పొడుచుకున్నారు అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మొదలుపెట్టారు” అని ఆవేదన వ్యక్తం చేసింది.

ట్రాన్స్‌జెండర్ అంటూ ట్రోలింగ్..
బరువు తగ్గిన తర్వాత ఎదుర్కొంటున్న విమర్శల గురించి అనందిత ఎంతో బాధతో కొన్ని విషయాలను పంచుకుంది. “గతంలో నన్ను లావుగా ఉన్నావని ఏడిపించారు. ఇప్పుడేమో సన్నగా అయిపోయావని విమర్శిస్తున్నారు. కొందరైతే నన్ను చూసి ‘నువ్వు ట్రాన్స్‌జెండర్ లా ఉన్నావు’ అని కూడా కామెంట్లు పెడుతున్నారు. నిజం చెప్పాలంటే ట్రాన్స్‌జెండర్లు ఎంతో అందంగా ఉంటారు, కానీ నన్ను అవమానించడానికి వీరు ఎందుకు ఆ పదాన్ని వాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు.”

“నేను మొదటిసారి బరువు తగ్గినప్పుడు.. మా బంధువులే నాకు సర్జరీ చేయించారంటూ పుకార్లు లేపారు” అని చెప్పింది. అలాగే, “సమాజంలో ద్వేషం అనేది ఎప్పటికీ ఆగదని నేను గ్రహించాను. నేను ఎవరి కోసమో బరువు తగ్గలేదు. నా కోసం, నా ఆరోగ్యం కోసం మాత్రమే తగ్గాను. నేను సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వచ్చే 100 కామెంట్లలో 90 నెగెటివ్ కామెంట్లు ఉన్నా.. ఇప్పుడు నేను వాటి గురించి అస్సలు పట్టించుకోవడం లేదు” అని గట్టిగా సమాధానమిచ్చింది.

తెర వెనుక అసలు రహస్యం..
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, అనందితకు నటిగా కంటే సినిమా దర్శకత్వం మరియు నిర్మాణ రంగాలపైనే ఎక్కువ ఆసక్తి ఉంది. 19 ఏళ్ల వయసులోనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం తల్లి ఖుష్బూతో కలిసి నిర్మాణ బాధ్యతలను చూసుకుంటోంది. “డబుల్ ఆక్యుపెన్సీ” సినిమా విజయం వెనుక కూడా ఆమె శ్రమ ఎంతో ఉందని టాక్.

సీఎం విజయ్‌ని చూసి మైమరచిపోయిన అనందిత..
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనందిత పంచుకున్న మరో ఆసక్తికర సంఘటన తమిళ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ని మొదటిసారి కలిసిన అనుభవం గురించి ఆమె చెబుతూ.. “విజయ్ సార్‌ను మొదటిసారి అంత దగ్గరగా చూసిన సంతోషంలో నాకు మాట రాలేదు, దాదాపు కళ్లు తిరిగి పడిపోయినంత పనైంది. నేను కింద పడబోతుంటే ఆయనే నన్ను పట్టుకున్నారు” అని చెప్పింది.

“మా అక్క అవంతిక వివాహ పత్రికను (వెడ్డింగ్ కార్డ్) అందించడానికి మేము సీఎం విజయ్ సార్‌ను కలవడానికి వెళ్లాము. అప్పుడు నేను ఆయనను అలా రెప్ప వేయకుండా చూస్తూనే ఉండిపోయాను. ఒకానొక దశలో మా అక్కే నన్ను గిల్లి.. ‘చాలు.. చాలు.. ఇక ఆపు…’ అని చెప్పాల్సి వచ్చింది” అంటూ నవ్వుతూ పాత జ్ఞాపకాలను పంచుకుంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *