మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన దాండియా/గర్భా వేడుకలో, ప్రవేశ ద్వారం వద్ద జరిగిన గొడవలో 16 ఏళ్ల బాలికను బలవంతంగా పక్కకు నెట్టి అసభ్యంగా ప్రవర్తించిన బీజేపీ నాయకుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తీవ్ర కలకలం రేపింది.
ఇండోర్ తూర్పు ప్రాంతంలోని గంగేశ్వరి గర్భా పండల్లో గత గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తన కుటుంబంతో కలిసి గర్భా వేడుకకు వచ్చిన ఆ బాలికను నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. దీంతో బాలిక కుటుంబ సభ్యులకు, నిర్వాహకులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన బీజేపీ జీజాబాయి మండల అధ్యక్షుడు కమల్ సింగ్ చౌహాన్.. బాలిక చేతిని పట్టుకుని లాగి, విచక్షణారహితంగా పలుమార్లు వెనక్కి నెడుతూ పండల్ బయటకు గెంటేశాడు. ఆ సమయంలో ఆ బాలిక “నన్ను ముట్టుకోవద్దు” అని గట్టిగా అరుస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.
ఈ వీడియో స్థానిక పోలీసుల దృష్టికి వెళ్లడంతో, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ దండోతియా నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ధ్రువీకరించారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఈ వివాదంలో నిందితుడైన కమల్ సింగ్ చౌహాన్‌ను పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అమిత్ చౌరాసియా డిమాండ్ చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నాయకత్వం కమల్ సింగ్ చౌహాన్‌కు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆయనను పార్టీ కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపామని, దీని ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని బీజేపీ నేత దీపక్ జైన్ తెలిపారు. మహిళలు, బాలికల భద్రతను కాపాడతామని చెప్పే అధికార పార్టీ నాయకుడే ఇలా బాలిక పట్ల దురుసుగా ప్రవర్తించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Leave a Reply