స్నేహితులు ఎంత సన్నిహితంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మానసిక వేదనను నివారించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను వారితో పంచుకోకపోవడమే మంచిది.
ఆ క్రమంలో, మన ఆదాయం, పొదుపు, బ్యాంక్ బ్యాలెన్స్, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టామనే ఆర్థిక లావాదేవీల వివరాలను ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే స్నేహం ఎంత గాఢమైనదైనా, డబ్బుకు సంబంధించిన విషయాలు కొన్నిసార్లు బంధంలో చీలికలు తెచ్చే ప్రమాదం ఉంది.
అదేవిధంగా, మన కుటుంబ జీవిత రహస్యాలను, భార్యాభర్తల మధ్య ఉండే వ్యక్తిగత విషయాలను స్నేహితులతో గానీ, మరెవరితో గానీ ఎప్పుడూ పంచుకోకూడదు. మనం చేసే చిన్నపాటి ఫిర్యాదులు కూడా ఇతరుల దృష్టిలో మన జీవిత భాగస్వామిపై ఉన్న గౌరవాన్ని తగ్గించేస్తాయి. అంతేకాకుండా, కుటుంబంలో జరిగే గొడవలు లేదా ఆస్తి తగాదాల వంటి వ్యక్తిగత విషయాలను బయట మాట్లాడకుండా ఉండటం వల్ల కుటుంబ పరువు, ప్రతిష్ఠలు నిలబడతాయి.
ఇతరులు మనపై పూర్తి నమ్మకంతో పంచుకున్న రహస్యాలను, ‘నా ప్రాణ స్నేహితుడే కదా’ అని భావించి వారికి కూడా చెప్పకూడదు. ఇది ముమ్మాటికీ నమ్మకద్రోహం కిందకే వస్తుంది. అంతేకాదు, మనం ఏం సాధించాలనుకుంటున్నామో ఆ లక్ష్యాలు లేదా ఆశయాలను పూర్తిగా నెరవేర్చే వరకు ఎవరికీ చెప్పకుండా ఉండటమే ఉత్తమం. మన స్నేహితుల ఆలోచనా విధానం మనకంటే భిన్నంగా ఉండవచ్చు కాబట్టి, వారి ప్రతికూల విమర్శలు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.

Leave a Reply