“నరకానికి స్వాగతం” – శుక్రవారం ప్రచురితమైన ఇరాన్ ఇంగ్లీష్ దినపత్రిక ‘టెహ్రాన్ టైమ్స్’ ప్రత్యేక ఎడిషన్ హెడ్లైన్ ఇది. ఈ పదాలు కేవలం హెడ్లైన్ మాత్రమే కాదు, ఇరాన్‌పై భూతల దాడికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న అమెరికాకు ఒక కఠినమైన హెచ్చరిక.
“ఇరాన్ గడ్డపై అడుగు పెట్టే అమెరికా సైనికులు కేవలం శవపేటికల్లోనే తిరిగి వెళ్తారు” అని ఆ పత్రిక పేర్కొంది. ఇరాన్ యొక్క వ్యూహాత్మక చమురు కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ ఆ ద్వీపంలో మైన్లను (మందుపాతరలు) అమర్చడం మరియు అదనపు బలగాలను మోహరించడం ప్రారంభించింది.
ఖార్గ్ ఐలాండ్ ప్రాముఖ్యత
ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఈ ఖార్గ్ ఐలాండ్ నుండే జరుగుతాయి. ఈ ద్వీపాన్ని ఆక్రమించుకోవడం ద్వారా, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేలా ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావచ్చని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.
నిపుణులు ఏమంటున్నారు?
అమెరికా సెంట్రల్ కమాండ్ మాజీ కమాండర్ జోసెఫ్ వోటెల్ మాట్లాడుతూ.. “ఖార్గ్ ఐలాండ్‌ను ఆక్రమించడానికి 800 నుండి 1,000 మంది సైనికులు సరిపోవచ్చు, కానీ వారికి రక్షణ కల్పించడం మరియు లాజిస్టికల్ సపోర్ట్ ఇవ్వడం చాలా కష్టం. ఆ ద్వీపంలో సైనికులు శత్రువుల దాడులకు సులభంగా గురయ్యే అవకాశం ఉంది” అని అభిప్రాయపడ్డారు.
ఇరాన్ సన్నద్ధత
అమెరికా కదలికలను ఇరాన్ నిశితంగా గమనిస్తోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఎంబీ ఘాలిబాఫ్ మాట్లాడుతూ.. “శత్రువు ఏ చిన్న అడుగు వేసినా, వారికి సహకరించే ప్రాంతీయ దేశాల కీలక మౌలిక సదుపాయాలపై కనికరంలేని దాడులు చేస్తాం” అని హెచ్చరించారు.
CNN నివేదిక ప్రకారం, అమెరికా సైన్యం ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఇరాన్ అడుగు తీస్తే పేలే యాంటీ-పర్సనల్ మరియు యాంటీ-ఆర్మర్ మైన్లను, ఇతర ఉచ్చులను (Traps) సిద్ధం చేసింది.
అమెరికాకు జరిగే నష్టం ఏమిటి?
ఆపరేషన్ అనలిస్టుల ప్రకారం.. ఖార్గ్ ఐలాండ్‌ను అమెరికా త్వరగానే స్వాధీనం చేసుకోవచ్చు, కానీ అక్కడ ఉన్న సైనికులకు క్షిపణులు మరియు డ్రోన్ల ముప్పు పొంచి ఉంటుంది. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధంలో వాడుతున్న ‘ఫస్ట్ పర్సన్ వ్యూ’ (FPV) డ్రోన్ల ద్వారా అమెరికా సైనికుల మరణాలను వీడియో తీసి, దానిని ప్రోపగాండా (ప్రచారం) కోసం ఇరాన్ వాడుకునే అవకాశం ఉంది.
మరోవైపు, ఇరాన్ సముద్రంలో మరిన్ని మైన్లను వేయడం ద్వారా రవాణా మార్గాలను మరింత ప్రమాదకరంగా మార్చవచ్చు. ఇది ఇప్పటికే దెబ్బతిన్న ప్రపంచ వాణిజ్యాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుంది.
