తుమకూరు : విడాకులు (Divorce) కోరిన భార్యపై భర్త కత్తితో దాడి చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా కోటెలో చోటుచేసుకుంది. శనివారం (ఏప్రిల్ 06) రాత్రి దంపతుల మధ్య జరిగిన ఈ గొడవ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య నాగమణి ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండగా, మరోవైపు భర్త మారుతి ఆదివారం (ఏప్రిల్ 07) ఉదయం కొరటగెరె తాలూకాలోని దొడ్డనహళ్లిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
అసలేం జరిగింది?
మైసూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న నాగమణి, మారుతి గత 15 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మారుతి వృత్తిరీత్యా తాపీ మేస్త్రీగా పనిచేస్తుండగా, నాగమణికి పెళ్లయిన తర్వాత ప్రభుత్వ నర్సుగా ఉద్యోగం వచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగం వచ్చినప్పటి నుండి నాగమణి జీవనశైలి మారిపోయిందని, తాపీ పని చేసుకునే భర్త మారుతి నుండి విడాకులు తీసుకోవాలని ఆమె ఆలోచిస్తోందని సమాచారం.
వివాహేతర సంబంధంపై అనుమానం
మరోవైపు, నాగమణికి మరొకరితో సంబంధం ఉందనే అనుమానం మారుతికి కలిగింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ గొడవ చివరకు మైసూర్‌లోని స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూడా చేరింది.
ఇదిలా ఉండగా, మొన్న కోటెలో తండ్రి దగ్గర ఉంటున్న తన పిల్లలను చూడటానికి నాగమణి వచ్చింది. ఆ సమయంలో దంపతుల మధ్య మళ్ళీ తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన మారుతి, కత్తితో నాగమణిపై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుండి పారిపోయాడు. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
భర్త బలవన్మరణం
భార్యపై దాడి చేసిన తర్వాత పరారీలో ఉన్న మారుతి, నేడు (ఏప్రిల్ 07) కొరటగెరె తాలూకాలోని దొడ్డనహళ్లిలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు శరణయ్యాడు. ఈ ఘటనపై కొరటగెరె పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
