ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో, వైద్య సిబ్బంది చేయాల్సిన పనిని సెక్యూరిటీ గార్డు చేస్తూ ఇంజెక్షన్లో మందు నింపిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
నోయిడా సెక్టార్ 39లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో, అక్కడి వాచ్మెన్ సిరంజిలోకి మందును ఎక్కిస్తున్న భయానక దృశ్యం ఇంటర్నెట్లో దావానలంలా వ్యాపించింది. ఆ సమయంలో వైద్యులు, వైద్య సిబ్బంది అక్కడే ఉండి మౌనంగా చూస్తూ ఉండటం ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ సంఘటన తీవ్ర వివాదానికి దారితీయడంతో, ఆసుపత్రి యాజమాన్యం వెంటనే విచారణ చేపట్టింది. విచారణ అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన సెక్యూరిటీ గార్డుతో పాటు సంబంధిత నర్సును తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.
ఆసుపత్రిలో ఎలాంటి వైద్య ప్రక్రియలనైనా అర్హత లేని, శిక్షణ పొందని సిబ్బందితో చేయించడం రోగుల ప్రాణాలకు ఎంతటి ముప్పు తెచ్చిపెడుతుందోననే తీవ్రమైన ప్రశ్నలను ఈ ఘటన లేవనెత్తింది.
ఆసుపత్రులలో సరైన విధివిధానాలు, నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడటానికి, ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి ఉన్నతాధికారులు పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేశారు.
