మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో (Chhatrapati Sambhajinagar) 75 ఏళ్ల వృద్ధురాలు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడటానికి తీవ్రంగా బానిసై ఆసుపత్రిలో చేరిన ఘటన వైద్యులను సైతం విస్మయానికి గురిచేసింది.
సాధారణంగా పిల్లలు, యువత మాత్రమే మొబైల్‌కు బానిసవుతారనుకునే ఈ రోజుల్లో, ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రారంభంలో కాలక్షేపం కోసం రీల్స్ చూడటం మొదలుపెట్టిన ఆ బామ్మ, రానురాను గంటల తరబడి ఫోన్‌లోనే మునిగిపోవడం ప్రారంభించింది. చేతిలో మొబైల్ ఉంటే ఆకలి, దప్పిక కూడా మర్చిపోయి భోజనం మానేయడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. కుటుంబ సభ్యులు ఆమె దగ్గరి నుంచి ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ ఇంట్లోని వస్తువులను విసిరేస్తూ నానా రచ్చ చేసింది.
దీంతో కంగుతిన్న కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే ఆసుపత్రిలోని ఐదుగురు రోగుల మొబైల్ ఫోన్లు అకస్మాత్తుగా మాయమయ్యాయి.
దీనిపై ఆసుపత్రి యాజమాన్యం సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, ఆ 75 ఏళ్ల బామ్మే ఇతరుల 5 ఫోన్లను తీసుకుని తన బ్యాగ్‌లో దాచిపెట్టినట్లు తేలింది. సుమారు 15 రోజుల పాటు అందించిన నిరంతర మానసిక చికిత్స తర్వాత ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిలో మంచి మెరుగుదల కనిపించింది.
పిల్లలు, యువకులు మాత్రమే కాకుండా ఇంట్లోని పెద్దవారు కూడా ఎక్కువ సమయం మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుంటే, కుటుంబ సభ్యులు దానిని సాధారణ విషయంగా తీసుకోకుండా వెంటనే గమనించాలని మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ మెరాజ్ ఖాద్రీ సూచించారు.

Leave a Reply