స్నేహితురాలితో కలిసి సినిమా చూడటానికి వెళ్లిందనే అనుమానంతో భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త.. ఆమెతో పాటు ఇద్దరు కుమార్తెలను కూడా ఇంటి నుంచి బయటకు పంపించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భరణం కోసం భార్య కోర్టును ఆశ్రయించగా, ఆమెకు, ఇద్దరు కుమార్తెలకు కలిపి నెలకు రూ.55 వేల చొప్పున చెల్లించాలని భర్తను న్యాయస్థానం ఆదేశించింది.
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, ఇద్దరు కుమార్తెలను భర్త ఇంటి నుంచి బయటకు పంపించినట్లు తెలుస్తోంది. దీంతో తనతో పాటు పిల్లల పోషణ ఖర్చుల కోసం భరణం ఇప్పించాలని కోరుతూ భార్య కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసు విచారణ సందర్భంగా భర్త తన ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని కోర్టుకు తెలిపాడు. తనకు స్థిరమైన ఆదాయం లేదని, తన వద్ద ఒకే ఒక్క గేదె ఉందని, అది కూడా తగినంత పాలు ఇవ్వడం లేదని వాదించాడు. ఇలాంటి పరిస్థితుల్లో భార్య, పిల్లల ఖర్చులు భరించలేనని చెబుతూ భరణం చెల్లించకుండా మినహాయింపు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
అయితే భర్త వాదనలను భార్య అంగీకరించలేదు. అతని అసలు ఆస్తులు, ఆదాయానికి సంబంధించిన వివరాలను సేకరించి కోర్టులో ఆధారాలుగా సమర్పించింది. భర్తకు సొంత గ్రామంలో 17.5 బిగాల వ్యవసాయ భూమి ఉందని, నాలుగు గదులు, వంటగది ఉన్న ఇల్లు కూడా ఉందని వెల్లడించింది. అంతేకాకుండా, భర్త చెప్పినట్లు ఒకే ఒక్క గేదె కాకుండా మూడు గేదెలు ఉన్నాయని, వాటి ద్వారా పాలు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నాడని ఆధారాలతో సహా వివరించింది.
ఇరుపక్షాల వాదనలు, భార్య సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. భర్త చెప్పిన ఆర్థిక ఇబ్బందుల వాదనను అంగీకరించలేదు. దీంతో భార్య, ఇద్దరు కుమార్తెల పోషణ ఖర్చుల కోసం ప్రతి నెలా మొత్తం రూ.55,000 చెల్లించాలని భర్తను ఆదేశించింది.
స్నేహితురాలితో కలిసి సినిమా చూడటంతో మొదలైన కుటుంబ వివాదం.. చివరకు భర్త ఆస్తులు, ఆదాయానికి సంబంధించిన వివరాలు కోర్టు ముందుకు రావడం, నెలవారీ భరణం చెల్లించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో ముగిసింది.

Leave a Reply