పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తొలి విడతగా 152 స్థానాల్లో 92.9 శాతం రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఈ భారీ ఓటింగ్ మార్పు కోసమేనని బీజేపీ నేతలు వాదిస్తుంటే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఆమె అన్న “నాకు కుర్చీ వద్దు” అనే ఐదు ముక్కల మాటపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
మమతా బెనర్జీ ఏమన్నారు? గురువారం కోల్‌కతాలోని బో బజార్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి ఢిల్లీని (కేంద్ర అధికార పీఠాన్ని) జయిస్తానని ధీమా వ్యక్తం చేశారు. “ప్రజల నాడి నాకు తెలుసు, ఇప్పటికే మేము గెలిచే స్థితిలో ఉన్నాం. నాకు ఏ పదవి పైనా ఆశ లేదు. నాకు కుర్చీ వద్దు. నా ఏకైక లక్ష్యం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని అంతం చేయడమే” అని ఆమె ప్రకటించారు.
ఓటర్ల జాబితా నుండి పేర్లను తొలగించినందుకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేశారని, తన పోరాటం వల్లే 32 లక్షల పేర్లు మళ్ళీ జాబితాలో చేరాయని ఆమె పేర్కొన్నారు.
దీదీ వ్యాఖ్యలకు 5 సంభావ్య అర్థాలు:
- వారసుడికి బాధ్యతలు?: ‘నాకు కుర్చీ వద్దు’ అంటే, ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ (TMC) మళ్ళీ గెలిచినా.. ఆమె ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించరా? తన మేనల్లుడు, టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీకి అధికారాన్ని అప్పగించాలని ఆమె నిర్ణయించుకున్నారా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
- ఢిల్లీ వైపు చూపు: బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మమత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ‘కుర్చీ వద్దు’ అంటూనే, ప్రతిపక్షాలను ఏకం చేసి కేంద్రంలో బీజేపీని ఓడిస్తానని ఆమె స్పష్టంగా చెప్పారు.
- ఇండియా (INDIA) కూటమి నాయకత్వం: విపక్ష కూటమికి తానే నాయకత్వం వహించాలని మమత ఆశిస్తున్నట్లు సమాచారం. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు కూడా మమత చేతికి ఇండియా కూటమి పగ్గాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఒకవేళ బెంగాల్ లో ఆమె వరుసగా నాలుగోసారి గెలిస్తే, దేశ రాజకీయాల్లో ఆమె స్థాయి అమాంతం పెరుగుతుంది.
- ప్రతికూల పవనాల సంకేతమా?: భారీ పోలింగ్ చూసి బెంగాల్ లో టీఎంసీకి వ్యతిరేక గాలి వీస్తోందని దీదీకి అర్థమైందా? అందుకే పదవిపై మోజు లేదన్నట్లుగా మాట్లాడుతున్నారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, పోరాట పటిమ గల నేతగా ఆమె ఇంకా ఎన్నికలు ముగియకముందే ఇలాంటి సంకేతాలు ఇచ్చే అవకాశం తక్కువ.
- ఎమోషనల్ కార్డు: రెండో దశ ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆమె ‘ఎమోషనల్ కార్డు’ వాడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తనకు పదవి ముఖ్యం కాదని, కేవలం బీజేపీని ఓడించడమే తన లక్ష్యమని చెప్పడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందే ప్రయత్నం కావచ్చని అంచనా.
