బీహార్ రాష్ట్రం భాగల్పూర్ ప్రాంతంలో 75 ఏళ్ల వృద్ధుడు తన కడుపు నింపుకోవడానికి సైకిల్ రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్న హృదయ విదారక వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఎందరినో కంటతడి పెట్టిస్తోంది.
భాగల్పూర్‌లోని బుధ్‌నాథ్ ప్రాంతంలో రిక్షా నడుపుతున్న ఆ వృద్ధుడిని సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ ఆదిత్య చౌహాన్ కలిసి మాట్లాడారు.
వృద్ధుడి వయసు, ఆయన పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయిన ఆదిత్య చౌహాన్, రిక్షాలో కూర్చోవడానికి మనసు ఒప్పక కాసేపటికే ఆ వృద్ధుడిని వెనుక సీట్లో కూర్చోబెట్టి, స్వయంగా తానే రిక్షా తొక్కడం ప్రారంభించారు. ఆ సమయంలో జరిగిన సంభాషణలో, తనకు ముగ్గురు కుమారులు ఉన్నారని, కానీ వారిలో ఒక్కరు కూడా తనకు భోజనం పెట్టడం లేదని ఆ వృద్ధుడు ఆవేదనతో తెలిపారు.
తన ముగ్గురు కొడుకులు బాగానే సంపాదిస్తున్నప్పటికీ, ఒక్క పూట భోజనం కూడా పెట్టకపోవడంతో 75 ఏళ్ల వయసులోనూ తానే స్వయంగా కష్టపడి బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన వాపోయారు. వీడియో చివరిలో ఆదిత్య చౌహాన్ ‘మీకు ఏం కావాలి?’ అని అడిగినప్పుడు కూడా, ఆ వృద్ధుడు ఏమీ ఆశించకుండా తన పరిస్థితిని మాత్రమే ప్రశాంతంగా పంచుకున్నారు.
ఆదిత్య చౌహాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మూడు భాగాలుగా పంచుకున్న ఈ వీడియోకు 15 లక్షలకు పైగా వ్యూస్, 92 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ వయసులో రిక్షా తొక్కుతున్న వృద్ధుడి పరిస్థితిని చూసి చలించిపోయిన నెటిజన్లు ఆయనకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.
మరోవైపు, ఒక తండ్రి ఒంటరిగా నిలబడి ముగ్గురు కొడుకులను పెంచి ప్రయోజకులను చేస్తే, ఆ ముగ్గురు కొడుకులు కలిసి ఒక్క తండ్రిని చూసుకోలేకపోవడం అత్యంత సిగ్గుచేటని పలువురు సోషల్ మీడియాలో తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply