గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని చంద్ఖేడా ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువకుడు తన భార్య, అత్త, బంధువులతో పాటు ఇద్దరు మాంత్రికులతో కలిపి మొత్తం ఆరుగురిపై పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు తీవ్ర కలకలం రేపింది.
పాటన్ ప్రాంతానికి చెందిన బాధితుడికి, మహారాష్ట్రలోని గోందియా ప్రాంతానికి చెందిన యువతితో ఇటీవల వివాహం జరిగింది. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచే పెళ్లికూతురి ప్రవర్తనపై అనుమానం ఉండేదని, పెళ్లయిన తర్వాత అది నిజమని తేలిందని అతను వాపోయాడు.
పెళ్లి తర్వాత, తనకు వేరే పురుషులతో ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని ఆ యువతి తన భర్త వద్ద నిర్మొహమాటంగా ఒప్పుకుంది. అంతేకాకుండా, “నిన్ను కొంతకాలం నా గుప్పిట్లో ఉంచుకోవడానికే చేతబడి, క్షుద్రపూజలు చేసి నా జీవితంలోకి రప్పించుకున్నాను” అని చెప్పి షాక్ ఇచ్చింది. భార్య సెల్‌ఫోన్‌ను పరిశీలించగా, అందులో అనేకమంది మాంత్రికుల ఫోటోలు ఉండటం చూసి అతను ఖంగుతిన్నాడు.
అంతటితో ఆగకుండా, ఆ మహిళ తరచూ భారీగా డబ్బులు ఇవ్వాలంటూ భర్తను బెదిరించసాగింది. డబ్బు ఇవ్వకపోతే భర్త, అతని కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తానని భయపెట్టింది. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆ యువకుడు, అత్తగారింటి వారి బెదిరింపులకు భయపడుతూ బతికాడు.
ఈ క్రమంలో ఆ మహిళ తన భర్తను ఇద్దరు మాంత్రికులకు పరిచయం చేసింది. ఆ తర్వాత భార్య, ఆమె తల్లి కలిసి ఆ యువకుడికి వీడియో కాల్ చేసి మాట్లాడుతుండగా, ఆ మాంత్రికులతో అతనిపై రెండుసార్లు ప్రత్యక్షంగా క్షుద్రపూజలు చేయించారు. ఈ పూజలు జరిగిన తర్వాత తన శరీరం బరువెక్కిందని, ఒక్కసారిగా ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని బాధితుడు తెలిపాడు.
భార్య వివాహేతర సంబంధాలు, వరుసగా డబ్బు కోసం బెదిరింపులు, చేతబడి భయాలతో విసిగిపోయిన ఆ యువకుడు చివరకు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. భార్యతో సహా ఆరుగురిపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వింత ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది.

Leave a Reply