‘నాకు రెస్ట్ అవసరం లేదు.. జింబాబ్వేకైనా వెళ్లి ఆడతా’.. సంజూ శాంసన్‌కు మద్దతుగా అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు

ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టులో స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టు యాజమాన్యం, సెలెక్షన్ కమిటీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సీనియర్ క్రీడా పాత్రికేయుడు విమల్ కుమార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజూ శాంసన్ ఎంపిక కాకపోవడంపై అడిగిన ప్రశ్నకు అశ్విన్ వ్యంగ్యంగా స్పందించారు.

‘నేనే సంజూ శాంసన్ అనుకుంటే…’

సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పేర్లను నేరుగా ప్రస్తావించకుండా, ఆటగాళ్లకు “రెస్ట్” పేరుతో విశ్రాంతి ఇవ్వడంపై అశ్విన్ సెటైర్లు వేశారు.

సంజూ శాంసన్ పాత్రలో మాట్లాడిన అశ్విన్ ఇలా అన్నారు..

“నేను టీ20 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ఆటగాడిగా నిలిచి, దేశానికి ప్రపంచకప్ అందించిన ఆటగాడిని. నాతో కొంచెం గౌరవంగా మాట్లాడండి.”

అని సరదాగా వ్యాఖ్యానించారు.

‘నాకు రెస్ట్ వద్దు.. జింబాబ్వేకైనా వెళ్లి ఆడతా’

అశ్విన్ వ్యంగ్యంగా మాట్లాడుతూ..

“నాకు ఎలాంటి విశ్రాంతి అవసరం లేదు. జింబాబ్వే వంటి క్రికెట్ దేశానికి వెళ్లి ఆడాలని ఉంది. 1999 ప్రపంచకప్‌లో భారత్‌పై జింబాబ్వే సాధించిన విజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. దయచేసి నన్ను జట్టులోకి తీసుకోండి.”

అంటూ ప్రస్తుత జట్టు యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలపై పరోక్షంగా విమర్శలు చేశారు.

సెలెక్షన్‌పై విమర్శలు

ఒక్క టీ20 మ్యాచ్‌లో విఫలమైన కారణంగా ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్‌ను పక్కనపెట్టి యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడంపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో అశ్విన్ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ వర్గాల్లో మరింత చర్చకు దారితీశాయి.


Posted

in

by

Tags: