ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో గంగా నది తీవ్ర ఉధృతిలో చిక్కుకుని కొట్టుకుపోతున్న సుమారు 70 ఏళ్ల వృద్ధుడిని స్థానిక ఈతగాళ్లు అత్యంత సాహసోపేతంగా రక్షించారు.
హర్ కీ పౌడీ ప్రాంతంలో గత సోమవారం సాయంత్రం ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. గంగా నదిలో వృద్ధుడు నీటిలో మునుగుతూ తేలుతూ కొట్టుకుపోతుండటం చూసిన స్థానిక యువకులు వెంటనే అతన్ని రక్షించేందుకు ఉపక్రమించారు. అక్కడున్న వారంతా తీవ్ర భయాందోళనలకు గురైన వేళ, ఇద్దరు యువకులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా గంగా నదిలోకి దూకారు.
హర్ కీ పౌడీ వద్ద భక్తులు నదిలో వేసే నాణేలు, కొబ్బరికాయలను ఒడిసిపట్టే పనిలో కొందరు యువకులు నిమగ్నమవడం సాధారణం. సంఘటన జరిగిన రోజున కూడా కొందరు యువకులు నది వద్ద ఉండగా, వేగంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో ఒక వృద్ధుడు కొట్టుకుపోవడాన్ని గమనించారు. నీటి ప్రవాహం అత్యంత వేగంగా ఉండటంతో, ఆ వృద్ధుడు ఒక క్షణం నీటి అడుగుకు వెళ్లిపోతూ, మరో క్షణం పైకి తేలుతూ ప్రాణాల కోసం అల్లాడిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇద్దరు స్థానిక ఈతగాళ్లు ఆయన వైపు నదిలోకి దూకి, తీవ్రంగా శ్రమించి వృద్ధుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
వృద్ధుడిని కాపాడుతున్న దృశ్యాలను అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఉరకలెత్తే గంగా నదిలో నియంత్రణ కోల్పోయి వృద్ధుడు కొట్టుకుపోవడం, అది చూసిన యువకులు మెరుపువేగంతో రంగంలోకి దిగి కాపాడటం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. వృద్ధుడిని రక్షించేందుకు దూకినప్పుడు ఒక యువకుడు నదీ తీరపు రక్షణ గోడపై కాలు జారినప్పటికీ, దాన్ని కూడా లెక్కచేయకుండా తిరిగి నదిలోకి దూకి వృద్ధుడిని పట్టుకున్నట్లు తెలిసింది. ప్రాణాలతో బయటపడిన ఆ వృద్ధుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియో ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు హర్ కీ పౌడీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అంకుష్ అగర్వాల్ తెలిపారు. మరోవైపు, అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న వృద్ధుడిని కాపాడేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి నదిలోకి దూకిన ఆ యువకుల ధైర్యసాహసాలను నెటిజన్లు వేనోళ్ల కొనియాడుతున్నారు.

Leave a Reply