మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లా జైలులో, గాంధీ జయంతి సందర్భంగా జైలులో ఉన్న ఖైదీలు తమ పిల్లలను నేరుగా కలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు.
ఎన్నో ఏళ్లుగా పిల్లలను కలవలేక తల్లడిల్లుతున్న 120 మంది ఖైదీలకు ఈ అవకాశం కల్పించారు. 3 నుంచి 10 ఏళ్ల లోపు పిల్లలు తమ తండ్రులను కలుసుకుని సంతోషించేలా జైలు ఆవరణలోని సమావేశ గదిని పండుగ వాతావరణంలా ముస్తాబు చేశారు. జైలు ఊచల వెనుక ఉన్న తండ్రులను చూడగానే పిల్లలు పరుగెత్తుకెళ్లి అమాంతం వాటేసుకున్నారు. చాలా రోజుల తర్వాత జరిగిన ఈ కలయిక అక్కడ ఉన్న వారందరినీ తీవ్ర ఉద్వేగానికి గురిచేసింది.
ఈ కలయికలో కొందరు పిల్లలు తమ తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకున్నారు. కొందరు తండ్రిని గుర్రంగా మార్చుకుని వీపుపై ఎక్కి ఆడుకున్నారు. ఇంకొందరు పిల్లలు పాఠశాలలో నేర్చుకున్న నృత్యాన్ని తండ్రి కోసం చేసి చూపించారు. జైలు అధికారులు ఇచ్చిన చాక్లెట్లు, బెలూన్లను పిల్లలు తమ తండ్రితో పంచుకున్నారు. ఆ సంతోషకరమైన క్షణాల మధ్య, కొంతమంది పిల్లలు తమ తండ్రితో “మిగతా పిల్లల నాన్నలు ఇంట్లో ఉంటున్నారు; మీరు మాత్రం ఇంట్లో ఎందుకు లేరు?” అని అడిగినట్లు తెలిసింది. పిల్లలు వేసిన ఈ ప్రశ్నలు ఖైదీల కంటతడి పెట్టించాయి.
ఈ ప్రత్యేక ఏర్పాటు గురించి ఖాండ్వా జిల్లా జైలు సూపరింటెండెంట్ దేవేంద్ర కుమార్ సారస్ మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా తమ 3 నుంచి 10 ఏళ్ల వయసున్న పిల్లలను కలుసుకోలేని 120 మంది ఖైదీలను ఎంపిక చేసినట్లు తెలిపారు. “నేరాన్ని ద్వేషించాలి; నేరస్థుడిని కాదు” అనే మహాత్మా గాంధీ సిద్ధాంతం ఆధారంగా ఈ కలయికను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. పిల్లలను కలిసినప్పుడు ఖైదీల్లో పశ్చాత్తాపం, కుటుంబంతో కలిసి జీవించాలనే తపన కనిపించిందని, ఇలాంటి ప్రయత్నాలు వారిలో సానుకూల మార్పు తీసుకురావడానికి సహాయపడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైదీలు, వారి కుటుంబ సభ్యుల కోసం వైద్య పరీక్షల శిబిరం కూడా నిర్వహించారు.
కలిసే సమయం ముగిసి పిల్లలు జైలు నుంచి బయటకు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు అక్కడి వాతావరణం మరింత భావోద్వేగంగా మారింది. అక్టోబర్ 3 నుంచి కొందరు పిల్లలకు స్కూల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పిల్లలు ఏడుస్తూ జైలు ప్రధాన ద్వారం వైపు వెళుతుండగా, జైలు ఊచల వెనుక నిలబడిన ఒక తండ్రి, “,పరీక్ష బాగా రాయి బిడ్డా… ఆల్ ది బెస్ట్!” అని కేక వేశాడు. కొడుకు పరీక్ష బాగా రాయాలని ఆశీర్వదించిన ఆ తండ్రి గొంతు అక్కడున్న అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులను సైతం కంటతడి పెట్టించింది. తండ్రి-పిల్లల మధ్య జరిగిన ఈ హృదయవిదారక కలయిక ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Leave a Reply