ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా అనారోగ్య సమస్యలే. ముఖ్యంగా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు సర్వసాధారణం అయిపోయాయి. షుగర్, బీపీల మాదిరిగానే చాలా మంది క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రుల్లో నరకం అనుభవిస్తున్నారు. క్యాన్సర్ రావడానికి నిర్దిష్టమైన కారణం అంటూ ఏదీ లేకపోయినా, మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, మనకు తెలియకుండా చేసే పనుల వల్లే ఈ ముప్పు వాటిల్లుతోంది. అది కూడా మన వంటగది నుండే మొదలవుతోంది.
నాన్‌స్టిక్ అనే విషం
మన వంటగదిలో విడదీయలేని భాగమైపోయిన నాన్‌స్టిక్ పాన్ లేదా పాత్రల గురించి ఇప్పటికే పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇనుము లేదా మట్టి పాత్రల వాడకం కష్టమని భావించి, ఆధునిక యుగంలో చాలా మంది నాన్‌స్టిక్ పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. టీవీ ప్రకటనల్లో నటీమణులు వీటిని వాడటం చూసి సామాన్యులు మోసపోతున్నారు. కానీ ఆ ప్రకటనల్లో నటించే వారు నిజంగా తమ ఇళ్లలో ఏం వాడుతున్నారో ఎవరికీ తెలియదు.
సంగీతా రెడ్డి హెచ్చరిక
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు FICCI మాజీ అధ్యక్షురాలు సంగీతా రెడ్డి, నాన్‌స్టిక్ పాత్రల వల్ల కలిగే ముప్పుపై సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై పడే చిన్న గీత కూడా ప్రాణాంతక వ్యాధులకు ఎలా దారితీస్తుందో ఆమె వివరించారు.
ఒక్క గీతతోనే జీవితం నాశనం
నాన్‌స్టిక్ పాత్రల్లో దోసెలు, చపాతీలు నూనె లేకుండానే సులభంగా వస్తాయి. కానీ ఆ పాత్రలపై గీతలు పడినప్పుడు, అందులోని విషపూరిత అంశాలు ఆహారం ద్వారా మన కడుపులోకి చేరుతాయి.
- PFAS (ఫరెవర్ కెమికల్స్): ఈ పాత్రలపై ఉండే కోటింగ్‌లో PFAS అనే కణాలు ఉంటాయి. వీటిని “శాశ్వత రసాయనాలు” అని పిలుస్తారు, ఎందుకంటే ఇవి మానవ శరీరంలో అంతం కావు. ఇవి క్యాన్సర్, హార్మోన్ల అసమతుల్యత, సంతానలేమి మరియు రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణమవుతాయి.
- షాకింగ్ గణాంకాలు: 2022లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, టెఫ్లాన్ కోటింగ్ ఉన్న పాత్రపై పడే ఒక్క చిన్న గీత దాదాపు 9,000 కంటే ఎక్కువ మైక్రో మరియు నానో ప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తుంది.
- క్యాన్సర్ ముప్పు: 2013 వరకు వీటి తయారీలో PFOA అనే రసాయనాన్ని వాడేవారు. ఇది కిడ్నీ మరియు వృషణ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది. నేడు కొత్త తరం PFAS రసాయనాలను వాడుతున్నప్పటికీ, అవి కూడా ఇటువంటి ఆరోగ్య సమస్యలనే తెస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
